Begin typing your search above and press return to search.

19ఏళ్ల బంధానికి చెక్: టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా

By:  Tupaki Desk   |   4 Jun 2021 7:30 AM GMT
19ఏళ్ల బంధానికి చెక్: టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా
X
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ 19 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. ఉద్యమకారుడిగా, మంత్రిగా సేవలందించిన ఈటల రాజేందర్ ఇన్నాళ్లుగా కొనసాగిన టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారులోని శామీర్ పేటలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భావోద్వేగంతో మాట్లాడారు.

ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను కానీ.. ఆత్మ గౌరవాన్ని వదలుకోనని ఈటల స్పష్టం చేశారు. ఆత్మగౌరవానికి అభివృద్ధి ప్రత్యామ్మాయం కాదని స్పష్టం చేశారు. బ్రిటీష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారని.. అయినా భారత జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిందని ఈటల చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం గతంలోనూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఈటల గుర్తు చేసుకున్నారు. ఆయన టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇస్తే ఇన్ని సార్లు తాను గెలిచానని చెప్పారు.

తన హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఎట్లా భరిస్తున్నవు బిడ్డా అని అడుగుతున్నారని.. ఇన్ని కుట్రలు, అవమానాలు అని నాతో అంటూ బాధపడుతున్నారని ఈటల వాపోయారు. నిన్ను కడుపుల పెట్టి చూసుకుంటాం అని వాళ్లే చెబుతున్నారని.. ప్రాణం ఉండగానే బొందపెట్టే విధంగా పార్టీ నాయకత్వం పనిచేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు.

తెలంగాణ వచ్చినంక అన్నివర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నాం.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని వాగ్ధానం చేసినం.. కానీ ఇవాల్టికైనా సీఎం కార్యాలయంలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి ఉన్నారా? ఒక్క బీసీ అయినా ఉన్నారా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.ఆర్థిక మంత్రి తాను కనీసం దరఖాస్తులు తీసుకునే స్వేచ్ఛ కూడా లేదని ఈటల ఆరోపణలు గుప్పించారు.