Begin typing your search above and press return to search.

ఈట‌ల ట్విట్ట‌ర్ ప్రొఫైల్ మారింది!... దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   25 May 2021 5:30 PM GMT
ఈట‌ల ట్విట్ట‌ర్ ప్రొఫైల్ మారింది!... దేనికి సంకేతం?
X
తెలంగాణ కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కు గురైన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజారాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. కేసీఆర్ నుంచి దూరం కాక త‌ప్పద‌న్న విషయం దాదాపుగా స్ప‌ష్ట‌మైన‌ట్టే. అయితే కేసీఆర్ కు యాంటీగా వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితికి చేరుకున్న ఈట‌ల.. సొంతంగా పార్టీ పెడ‌తారా? లేదంటే ఇప్ప‌టికే కొన‌సాగుతున్న ఏదేనీ రాజ‌కీయ పార్టీలో చేరిపోతారా?... అన్న‌దానిపై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా మంగ‌ళవారం ఈట‌ల త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ ను పూర్తిగా మార్చేశారు. కొత్త ప్రొఫైల్ లో టీఆర్ఎస్ రంగు గులాబీ చాయ‌లే క‌నిపించ‌డం లేదు. అయితే ఆ ప్రొఫైల్ లో లెక్కలేన‌న్ని ఈక్వేష‌న్లు రేకెత్తేలా ఈట‌ల త‌న‌దైన మార్కు మార్పులు చేశారు. అయితే ఈ ప్రొఫైల్ ఆధారంగా ఈట‌ల భ‌విష్య‌త్తు వ్యూహం ఏమిట‌న్న విష‌యంపై మాత్రం క్లారిటీ లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఈట‌ల కొత్త ట్విట్ట‌ర్ ప్రొఫైల్ లో చిరున‌వ్వులు చిందిస్తున్న ఈట‌ల ముఖం, ఆయ‌న మెడ‌లో బ్లూ నీలం రంగు కండువా ఉంది. పైన బీసీల గొంతుక జ్యోతిబా పూలే, ద‌ళిత బాంధ‌వుడు, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ల‌తోపాటుగా తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదిన ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ చిత్రాలు వ‌రుస‌గా క‌నిపిస్తున్నాయి. అదే వ‌రుస‌లో ఎడ‌మవ‌పున తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం, దాని ప‌క్క‌నే అమ‌ర‌వీరుల స్థూపం ఫొటోలున్నాయి. ఇక బ్యాక్ డ్రాప్ గా తెలంగాణ ఉద్య‌మం కొన‌సాగుతున్న తీరు క‌నిపిస్తోంది. ఈ ప్రొఫైల్ మొత్తం కాషాయం రంగు క‌లిగిన వేదిక‌పై అమ‌ర్చిన వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ కొత్త ట్విట్ట‌ర్ ప్రొఫైల్ చూస్తుంటే... ఈట‌ల కొత్త రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తార‌న్న వాద‌న‌లు అయితే బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే ఈట‌ల నోట నుంచి ఈ దిశ‌గా ఒక్క‌టంటే ఒక్క మాట కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

స్వ‌యంగా కేసీఆరే టార్గెట్ చేసిన‌ట్టుగా ఈట‌ల‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం, ఈట‌ల కుమారుడిపై ఫిర్యాదు రాగానే విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయ‌డం చూస్తుంటే.. ఇక భ‌విష్య‌త్తులో కేసీఆర్ తో ఈట‌ల క‌లుస్తార‌నే మాట‌కు చెల్లుచీటి ప‌డిన‌ట్టే. టీఆర్ఎస్ ఈట‌ల‌ను బ‌హిష్క‌రిస్తుందా? లేదంటే.. ఈట‌ల‌నే స్వ‌యంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారా? అన్న‌దే ఇప్పుడు తేలాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఇది తేలిపోనుంది. అయితే ఈక్ర‌మంలో ఇటు లెఫ్ట్ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన ఈట‌ల‌... అటు కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌తో వ‌రుస భేటీలు వేస్తున్నారు. ఈక్ర‌మంలో ఆయ‌న సొంతంగా పార్టీ పెట్టే అవ‌కాశాలు లేవ‌ని, ఏదో ఒక పార్టీలో ఆయ‌న చేర‌బోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైన్ మార్చినా ఈట‌ల త‌న భవిష్య‌త్తు వ్యూహంపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వ‌లేద‌నే చెప్పాలి.