Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ న్యూస్‌!..కూలిన బోయింగ్‌ - 157 మంది మృతి!

By:  Tupaki Desk   |   10 March 2019 10:49 AM GMT
బ్రేకింగ్ న్యూస్‌!..కూలిన బోయింగ్‌ - 157 మంది మృతి!
X
విమాన ప్ర‌మాదాలు జ‌రిగితే... ప్రాణ న‌ష్టం ఏ మేర ఉంటుందో తెలియ‌నిది కాదు. అల్లంత ఎత్తున ఆకాశ వీధిలో వెళ్లే విమానం కుప్ప‌కూలిందంటే... అందులో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల‌తో పాటు అందులో ఉండే సిబ్బంది కూడా మ‌ర‌ణించడం ఖాయ‌మే. అదృష్టవ‌శాత్తు ఒక‌రో- ఇద్ద‌రో బ‌తికి బ‌ట్ట‌క‌ట్టినా... మెజారిటీ ప్ర‌యాణికులు - సిబ్బంది ప్రాణాల్లో గాల్లో క‌లిసిపోయిన్ట‌టే. ఇప్ప‌టిదాకా చ‌రిత్ర‌లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో జ‌రిగింది ఇదే. అలాంటి ప్ర‌మాద‌మే ఇప్పుడు మ‌రొక‌టి చోటుచేసుకుంది. మొత్తం 157 మంది ప్రాణాల‌ను గాల్లో క‌లిపేసింది. నేటి ఉద‌యం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణాల సంఖ్య‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాకున్నా... విమానంలో ఎంత మంది ఉంటే... అంద‌రూ చ‌నిపోయిన‌ట్టుగానే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విమాన ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే... ఇథియోపియన్ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన బోయింగ్ 737 విమానం నేటి ఉదయం 8.44 గంటలకు కూలిపోయింది.

అదిస్ అబాబా నుంచి రైరోబీకి బ‌య‌లుదేరిన ఈ విమానంలో 149 మంది ప్ర‌యాణీకులున్న‌ట్లుగా ప్రాథ‌మిక స‌మాచారం. వీరితో పాటు విమాన సిబ్బంది 8 మంది ఆ విమానంలో ఉన్నార‌ట‌. అంటే... మొత్తం 157 మందితో గాల్లోకి లేచిన బోయింగ్ 737 విమానం గ‌మ్యం చేర‌కుండానే కూలిపోయింది. త‌మ విమానం కూలిపోయిన‌ట్టుగా ఇప్ప‌టికే ఇథియోపియన్ ఎయిర్‌ లైన్స్ ప్ర‌క‌టించ‌గా... ఆ దేశ ప్ర‌భుత్వం కూడా ఈ వార్తను ధ్రువీక‌రించింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో విమానంలో ఉన్న అంద‌రూ చ‌నిపోయిన‌ట్టుగానే భావిస్తున్న‌ట్టు ఇథియోపియా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివ‌రాలు మాత్రం పూర్తిగా విడుద‌ల కాలేదు. ప్ర‌మాదం స‌మాచారం అందిన వెంట‌నే... వెంట‌నే రంగంలోకి దిగిన ఇథియయోపియా ప్ర‌భుత్వం... ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు, మృతుల వివ‌రాల‌ను రాబ‌ట్టే ప‌నిని మొద‌లుపెట్టింది.