Begin typing your search above and press return to search.

యూర‌ప్ పెద్దాయ‌న‌ చైనా దొంగ‌బుద్ధిని చెప్పేశారు

By:  Tupaki Desk   |   15 July 2017 6:00 PM GMT
యూర‌ప్ పెద్దాయ‌న‌ చైనా దొంగ‌బుద్ధిని చెప్పేశారు
X
ఇటీవ‌లి కాలంలో త‌ర‌చుగా క‌య్యానికి కాలుదువ్వుతున్న చైనా ప‌రువు అంత‌ర్జాతీయ స్థాయిలో పలుచ‌న అవుతోంది. మ‌న‌దేశంతో ఉద్దేశ‌పూర్వ‌కంగా కెలుక్కుంటున్న చైనా తీరును అంత‌ర్జాతీయ నిపుణులు సైతం త‌ప్పుప‌డుతున్నారు. తాజాగా ఐరోపా పార్లమెంటు ఉపాధ్యక్షుడు రిజార్ట్ జార్నెస్కీ సైతం చైనా తీరును త‌ప్పుప‌ట్టారు. భారత్-చైనా సరిహద్దులోని డోక్లాం విష‌యంలో చైనా త‌ప్పుడు ప్ర‌వ‌ర్త‌న‌కు చెక్ పెట్టేలా భార‌త్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించింద‌ని విశ్లేషించారు. యూరోపియన్ పార్లమెంటు కోసం రాసిన ఓ వ్యాసంలో జార్నెస్కీ చైనా కుట్ర‌ను బట్టబయలు చేశారు. అదే స‌మ‌యంలో భార‌త‌దేశం బ‌ల‌మైన అడుగుల‌ను విశ్లేషించారు.

త‌మ విదేశాంగ విధానంలో చైనా చెప్తున్న‌ది ఒక‌టి చేస్తున్న‌ది ఇంకొక‌ట‌ని ఐరోపా పార్లమెంటు ఉపాధ్యక్షుడు రిజార్ట్ జార్నెస్కీ విశ్లేషించారు. ``ప్రపంచ దేశాలకు చైనా అబద్ధాలు చెప్తోంది. శాంతియుత అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రోత్సహించ‌డ‌మే మా విధానం త‌ప్ప చైనా ఎదుగుదల ప్రపంచ దేశాల శాంతికి ఏ విధంగాను ముప్పుకాదు అని ఆ దేశం పైకి చెప్తున్న‌ప్ప‌టికీ అందులో నిజం లేదు. డోక్లాం ప్రాంతంలోని డోకలానుంచి జోర్న్‌పెర్లిలోని భూటాన్ సైనిక శిబిరం వైపు రోడ్డు నిర్మాణం విషయంలో దూకుడుగా, ఏకపక్షంగా వ్యవహరించిన తీరే ఇందుకు నిద‌ర్శ‌నం. జోర్న్‌పెల్రిలోని భూటాన్ ఆర్మీ క్యాంప్ దిశగా సైనిక వాహనాలు తిరగడానికి అనువుగా ఉండే రోడ్డును నిర్మించాలని జూన్ 16న చైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యంలో తాము ఏమైనా చేయ‌వ‌చ్చ‌ని భావించింది. అయితే ప‌క్క‌నే ఉన్న భార‌త్ భూటాన్ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడింది. ఈ విషయం చైనాకు మింగుడుప‌డ‌టంలేదు `` అని విశ్లేషించారు.

త‌న త‌ప్పు బ‌య‌ట‌ప‌డిన‌ త‌ర్వాత కూడా చైనా బుద్ధి మార్చుకోలేద‌ని జార్నెస్సీ వ్యాఖ్యానించారు. భూటాన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యంలో భార‌త్‌ను బ‌ద్‌నాం చేయాల‌ని చైనా విశ్వ‌ప్ర‌య‌త్నం చేసింద‌ని విశ్లేషించారు. ఆ ప్రాంతంనుంచి భారత సైన్యాలు వెనక్కి వెళ్లేంతవరకు ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరపబోమని చైనా పట్టుబడుతుండ‌టం వెనుక మ‌ర్మం కూడా ఇదేన‌ని అన్నారు. కేవ‌లం భార‌త్‌ నే కాకుండా మ‌రికొన్ని దేశాల విష‌యంలో చైనా ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించింద‌ని జార్నెస్కీ అన్నారు. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులకు సంబంధించి మలేసియా, వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పీన్స్ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక పట్టును విస్తరించుకోవడం దీనికి ఓ చక్కటి ఉదాహరణ అని జార్నెస్కీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించకుండా ముందుకువెళుతున్న చైనాకు భ‌విష్య‌త్‌లో కష్టకాలం త‌ప్ప‌ద‌ని జార్నెస్కీ స్పష్టం చేశారు.