Begin typing your search above and press return to search.

టికెట్ ఇవ్వ‌క‌పోయినా ఓకే.. ఆ ప‌ని మాత్రం నా వ‌ల్ల కాదంటున్న ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   23 July 2022 7:42 AM GMT
టికెట్ ఇవ్వ‌క‌పోయినా ఓకే.. ఆ ప‌ని మాత్రం నా వ‌ల్ల కాదంటున్న ఎమ్మెల్యే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు గెల‌వ‌ని చోట ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు ఈ కార్యక్ర‌మం నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు.

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించ‌డంతోపాటు సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఎంత ల‌బ్ధి చేకూరిందో వివ‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రిగా చేయ‌నివారు ఎవ‌రైనా స‌రే వచ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేద‌ని ఖ‌రాఖండీగా తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే చాలా చోట్ల వీరికి ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదుర‌వుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వివిధ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. దీంతో అధికార పార్టీ నేత‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు.

తాజాగా శ్రీస‌త్య‌సాయి జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేఒక‌రు తాను ఈ గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మం నిర్వ‌హించేలేన‌ని.. పార్టీ త‌ర‌ఫున అన్ని వ్య‌వ‌హారాలు చూసే ఒక పెద్ద వ్య‌క్తికి చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గంలో పలుమార్లు ప్ర‌జ‌లు నిల‌దీశార‌ని, మ‌హిళ‌లు దారుణంగా త‌నను బూతులు తిడుతున్నార‌ని ఆ ఎమ్మెల్యే ఆ పెద్ద వ్య‌క్తికి చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిందేన‌ని.. ఎవ‌రికీ మిన‌హాయింపులు లేవ‌ని ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన‌ట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీంతో ఆ ఎమ్మెల్యే.. మ‌హిళ‌లతో తాను దారుణ‌మైన తిట్లు తిన‌లేన‌ని.. మీరు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర‌వాలేద‌ని.. గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని మాత్రం నిర్వ‌హించ‌లేన‌ని ఆ పార్టీ పెద్ద‌కు తేల్చిచెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా ఇటీవ‌ల ఒక మ‌హిళ ఆయ‌న‌ను గ‌ట్టిగా తిట్ట‌డం, ఆ విష‌యం మీడియాలోనూ ప్రముఖంగా రావ‌డంతోనే ఎమ్మెల్యే క‌ల‌త చెందార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌మ ఎమ్మెల్యే ఇక మీద‌ట గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు.