Begin typing your search above and press return to search.

గడ్డు వేళలోనూ.. ఇచ్చిన మాట తప్పని జగన్

By:  Tupaki Desk   |   20 April 2021 2:57 AM GMT
గడ్డు వేళలోనూ.. ఇచ్చిన మాట తప్పని జగన్
X
మాట ఇవ్వటం అందరు చేసేదే. కానీ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వేళలో.. ఇచ్చిన మాటను పూర్తి చేయటం అంత ఈజీ కాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి.. కమిట్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఓవైపు కరోనా విలయం.. మరోవైపు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక గడ్డు పరిస్థితి. ఇలాంటివేళ.. సంక్షేమ పథకాల అమలును ఆలస్యం చేయటమో.. లేదంటే వాయిదా వేయటం అందరూ చేసే పని.

అందుకు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. షెడ్యూల్ ప్రకారం తాను అమలు చేస్తానని మాట ఇచ్చిన పథకాల్ని యథాతధంగా అమలు చేస్తున్నారు. సోమవారం జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోడబ్బులు వేసిన ముఖ్యమంత్రి.. ఈ రోజు (మంగళవారం) రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఎన్నికల వేళలో.. సుననా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేస్తానని మాట ఇచ్చిన జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం 1,132 కోట్లను వడ్డీ రాయితీగా అందజేసింది. లక్ష వరకు పంట రుణాన్ని తీసుకొని ఏడాది లోపు తిరిగి చెల్లించిన 6.27 లక్షల మందికి వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లను తిరిగి చెల్లిస్తున్నారు. ఈ రోజు క్యాంపు కార్యాలయం నుంచి కంప్యేటర్ బటన్ నొక్కటం ద్వారా.. ఈ భారీ మొత్తాన్ని అర్హులైన రైతుల ఖాతాల్లోకి వేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు చెల్లించే విషయంలోనే కిందామీదా పడుతున్నారు. ఇలాంటివేళలోనూ.. ఎవరిని నొప్పించకుండా ఉండేందుకు జగన్ పడుతున్న తపన చూసినప్పుడు..ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి చూపించే కమిట్ మెంట్ ఇట్టే ఆకర్షిస్తోందని చెప్పాలి. కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్లో మిగిలిన వారు పట్టించుకోని విషయాన్ని సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా పట్టించుకోవటం గమనార్హం.