Begin typing your search above and press return to search.

జగనన్నా... తమరి మూలాలూ తెలంగాణాలోనే కదా సార్...

By:  Tupaki Desk   |   24 Dec 2022 2:30 PM GMT
జగనన్నా... తమరి మూలాలూ తెలంగాణాలోనే కదా సార్...
X
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సినీ సెలిబ్రిటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకూ రాష్ట్రం కలసి ఉన్నా విడిపోయినా సరే నూటికి తొంబై తొమ్మిది శాతం హైదరాబాద్ లోనే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఇందులో రాజకీయాలకు తావు లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా కూడా లేదు. అందరూ ఆ తానులో గుడ్డలే.

ఆ మాత్రం సౌభాగ్యానికి నేను పక్కా లోకల్ అని ఏపీకే పరిమితం అయిన రాజకీయ నాయకుడీని ఎవరూ చూపించలేరు. ఎందుకంటే రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజలు మాత్రం మానసినకంగా ఇంకా హైదరాబాద్ తమదే అని భావిస్తున్నారు కాబట్టి. పైగా ఏపీలో హైదరాబాద్ సాటి నగరం కూడా లేకపోవడం, అప్పటికే ఉన్న వ్యాపార సంబంధ బాంధవ్యాలు కూడా ముడిపడి ఉండడం.

ఇలా చాలా రీజన్స్ వల్ల హైదరాబాద్ లోనే ఏపీ నాయకత్వం కూడా ఉంటోంది. ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా తమ నేతలు  హైదరాబాద్ లో ఉన్నారు అని వేరుగా చూడడంలేదు. అయితే దాన్ని కూడా ఇష్యూ చేయవచ్చు అని వైసీపీ భావిస్తోంది లా ఉంది. అందుకే జగన్ కడప జిల్లా మీటింగులో తాను పక్కా ఏపీ వాసిని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. పైగా తన నివాసం తాను కట్టుకున్న ఇల్లు తన రాజకీయం, తమ పార్టీ అన్నీ ఏపీ కోసమే ఏపీలోనే ఉన్నాయని ఆయన గట్టిగా చెప్పుకున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ మధ్యలో చంద్రబాబుని తీసుకుని వచ్చారు. బాబు హైదరాబాద్ లొనే నివాసం ఉంటున్నారు. ఆయన ఏపీకి వచ్చి వెళ్తున్నారు. ఇపుడు తెలంగాణాలో రాజకీయం మళ్ళీ మొదలెట్టారు. వీటిని దృష్టిలో ఉంచుకుని జగన్ బాబు మీద బాణాలు వేశారు. తాను పక్కా లోకల్ అయితే బాబు పరదేశి అన్నట్లుగా జనంలో చిత్రీకరిస్తున్నారు అని అంటున్నారు.

నిజానికి జగన్ కి 67 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఇస్తే ఆనాడు జగన్ ఏమి చేశారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫ్లాష్ బ్యాక్ ని తెచ్చి మరీ విమర్శిస్తున్నారు. జగన్ సైతం హైదరాబాద్ లోనే ఉన్నారని, అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన విమానంలో వచ్చి వెళ్ళిపోయారని, ఆయన విమాన ఖర్చులకు కూడా ప్రజల సొమ్ము నుంచే ప్రభుత్వం చెల్లించింది అని గుర్తు చేస్తున్నారు.

ఇక శని ఆదివారాలలో కూడా జగన్ హైదరాబాద్ లోనే ఉన్నారని ఏపీ వైపు చూడలేదని అంటున్నారు. ఇక జగన్ ఆస్తులు వ్యాపారాలు లోటస్ పాండ్ బంగళా, ఆయన సాక్షి మీడియా అన్నీ ఈ రోజుకీ హైదరాబాద్ లోనే నడుస్తున్నాయి కదా అని కూడా గుర్తు చేస్తున్నారు. మూడేళ్ళుగా జగన్ ఏపీలోనే ఉంటున్నారు. ఇల్లు కట్టుకున్నారు అందులో తప్పు లేదు కానీ తన గతాన్ని విస్మరించి టీడీపీ మీద కానీ మరొకరి మీద కానీ విమర్శలు చేస్తే అవి రివర్స్ లో తనకు తగులుతాయన్న సోయి ఉండాలి కదా సామీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒకటి అనడం ఎందుకు నాలుగు వెళ్ళతో తనను చూపించుకోవడం ఎందుకు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.