Begin typing your search above and press return to search.

బాబర్ వీలునామాపై రాజ్ నాథ్ మాటేమిటంటే..?

By:  Tupaki Desk   |   9 Aug 2015 4:51 AM GMT
బాబర్ వీలునామాపై రాజ్ నాథ్ మాటేమిటంటే..?
X
గోవధ.. గో మాంసానికి వ్యతిరేకంగా బీజేపీ ఎప్పటి నుంచో ఉద్యమిస్తుందో తెలిసిందే.కేంద్రంలో కొలువు తీరిన నేపథ్యంలో.. పలు రాష్ట్రాల్లో గోవధకు వ్యతిరేకంగా కార్యక్రమాల్ని నిర్వహించటంతోపాటు.. పలు రాష్ట్రాల్లో గో వధకు వ్యతిరేకంగా చట్టాల్ని తీసుకొచ్చే ప్రయత్నం తెలిసిందే.

దీన్ని సమర్థించే వారున్నట్లే.. తప్పు పట్టే వారున్నారు. గోవధను వ్యతిరేకించే వారికి తగ్గట్లే.. గోవధ తప్పేం కాదని లెక్చర్లు ఇచ్చే వారు తక్కువేం కాదు. తాజాగా ఈ సున్నితమైన అంశం గురించి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా స్పందించారు. గోవధకు సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు.

గోవధకు బహిరంగంగా మద్ధుతు ఇస్తే.. భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించలేమన్న సంగతి మొఘల్ పాలకులు గుర్తించినట్లుగా రాజ్ నాథ్ వెల్లడించారు. ఈ కారణంతోనే గోవధను మొఘల్ పాలకులు బహిరంగంగా అమలు చేయలేదన్నారు. కానీ.. బ్రిటీష్ పాలకులు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోయారని.. ఈ కారణంగానే 1857లో సిపాయిల తిరుబాటు చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. గోవధ అంశంపై మొఘల్ పాలకుల విషయాల్ని వెల్లడించారు. భారతదేశంలో మొఘల్ రాజ్య స్థాపనను షురూ చేసిన బాబర్ తన వీలునామాలో భారత్ ను ప్రజారంజకంగా పాలించడమా.. గో మాంసాన్ని తినడమా.. ఈ రెండింటిలో ఒక్కటే సాధ్యమవుతుందని పేర్కొన్నట్లుగా రాజ్ నాథ్ వెల్లడించారు. మరిన్ని చారిత్రక అంశాలు ఉన్నప్పుడు.. దేశవ్యాప్తంగా గోవధ నిషేధంపై కఠిన చర్యలు తీసుకోవటానికి మోడీ సర్కారు కిందామీదా ఎందుకు పడుతున్నట్లు..?