Begin typing your search above and press return to search.

మోడీ భజనలో ఆఖరుకు మీడియా కూడా....?

By:  Tupaki Desk   |   12 Nov 2022 5:10 AM GMT
మోడీ భజనలో ఆఖరుకు మీడియా కూడా....?
X
మోడీ అంటే ఎందుకో అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. ఆయన ఎనిమిదేళ్ళుగా దేశాన్ని ఏలుగుతున్నమొనగాడుగా ఉన్నారు. దాంతో మూడు దశాబ్దాల తరువాత ఫుల్ మెజారిటీ కలిగిన ప్రధాని అన్న భయమో లేక రెండు సార్లు సొంత పార్టీని గెలిపించి వరసగా ప్రధాని అయిన సమర్ధుడు అని కలవరపడుతున్నారో లేక తమకు ఏమాత్రం బలం లేని చోట కూడా ప్రభుత్వాలను స్థాపించే నేర్పు కలిగిన రాజకీయ చాణక్యతను చూసి బెదురుతున్నారో లేక శక్తివంతమైన దర్యాప్తు సంస్థలు కేంద్రం వద్ద ఉంటాయని జంకుతున్నారో ఏమో కానీ గతానికి పోలిస్తే దేశంలోని విపక్ష రాజకీయం మాత్రం ఎందుకులే మనకు ఆయనతో అని చాలా సార్లు సర్దుకుపోతోంది.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా బయటకు వచ్చిన వారిని రాజకీయంగా వేటాడుతున్నా చూస్తూ మిన్నకుండే రాజకీయమూ దేశంలో విపక్ష శిబిరంలో సాగుతోంది. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలో లేక వారి బలాలో బలహీనతలో లేక వారి మార్క్ వ్యూహాలో అని సరిపెట్టుకున్నా అసలు మీడియాకు ఏమైంది అన్నదే కీలకమైన పాయింట్.

నిజానికి మీడియాకు ఏ రకమైన రిజర్వేషన్లు లేవు, ఉండకూడదు, దేశానికి ప్రధాని అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా వారు పర్యటనలు చేసేటపుడు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయాలి. ఆయా చోట్ల ఉన్న సమస్యలను ఏకరువు పెట్టాలి. అలా పెద్దల దృష్టికి తీసుకురావాలి. కానీ మోడీ విషయంలో మాత్రం తెలుగు మీడియా అందునా ఏపీకి సంబంధించి కవరేజ్ చేసే మీడియా మాత్రం కేవలం పాజిటివ్ వార్తలకే పరిమితం అయిపోయింది.

మోడీకి ఘనమైన స్వాగతం లభించింది అంటూ రాయడాన్ని ఏమనుకోవాలి. అలా చూపించడాన్ని ఏమనుకోవాలి. మోడీ రోడ్ షో వాస్తవంగా పేలవంగా జరిగింది. అయినా కూడా జనాలు కిక్కిరిపోయారు అన్నట్లుగా పార్టీ జనాలు కలరింగ్ ఇస్తే దాన్నే పట్టుకుని హైలెట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి అని అంటున్నారు. ఇక ఏపీకి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అన్ని విధాలుగా గత ఎనిమిదేళ్ల కాలంలో తీరని అన్యాయం చేసింది.

విభజన హామీలను ఏ విధంగానూ నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా అటకెక్కింది. అర కొర నిధులు ఇస్తూ అప్పులు చేసుకోమంటున్నారు. సరైన ప్రాజెక్టులు లేవు. కొత్తగా ఇచ్చినవీ అంతకంటే లేదు. కేంద్ర ప్రభుత్వ సమ్ష్తలకు శంకుస్థాపన చేసి ఊరుకున్నారు కానీ నిధులు బడ్జెట్ లో కనీసంగా కేటాయించడంలేదు. అవి ఎప్పటికి పూర్తి అవుత్తాయన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోడీ ఏపీకి రాక రాక వస్తూంటే ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుగా వివరించి స్టోరీస్ ఇవ్వాల్సింది, ఆయన దృష్టిలో కనీసమైనా పెట్టల్సింది మీడియా కదా.

కానీ మీడియా ఫోకస్ అంతా మోడీ ఎవరిని కలిసారు, ఆయన ఎవరితో భేటీలు వేశారు వాటి మీదనే చర్చలు, డిబేట్లతో సరిపుచ్చుతోంది. మోడీ ఎవరిని కలసినా ఆయన తన పార్టీ ఎదుగుదల కోసం రాజకీయం చేసుకుంటారు. అందులో తప్పుపట్టాల్సింది లేదు. అది వారి బాధ్యత. కానీ మీడియా కూడా ఏపీ అంతా సవ్యంగా ఉన్నట్లుగా ఏపీ సమస్యలను వదిలేసి మోడీని ఫోకస్ చేస్తూ ఆయన చుట్టూ కెమెరాలను పెట్టి హంగామా చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నదే సగటు జనం ప్రశ్న.

అటు అధికార పక్షం నోరు విప్పక ఇటు ప్రతిపక్షాలూ చెప్పక ఆఖరుకు మీడియా కూడా ఏదీ చూపించకుండా ఉంటే మోడీకి ఏపీలో టూర్ పండగే కదా. అంతా బాగుందని ఆయన హ్యాపీగా ఫ్లైటెక్కి ఎంచక్కా వెళ్ళిపోతున్నారంటే ఆ తప్పు ఆయనదా లేక కనీసం తమ బాధను అయినా విప్పి చెప్పుకోలేని వారిదా. ఎంతైనా మోడీ గ్రేట్ మాత్రమే కాదు లక్కీ కూడా. అందుకే ఎన్నడూ లేని విధంగా ఎవరూ చూడని విధంగా మీడియా ఫుల్ సపోర్ట్ ఆయనకు ఏపీలో దక్కుతోంది అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.