Begin typing your search above and press return to search.

ఎవ‌రెస్టు ఎక్కినా..ర్యాగింగ్ త‌ప్ప‌లేదు

By:  Tupaki Desk   |   5 Nov 2015 5:52 AM GMT
ఎవ‌రెస్టు ఎక్కినా..ర్యాగింగ్ త‌ప్ప‌లేదు
X
కాలేజీ విద్యార్థులను కలవరపెడుతున్నర్యాగింగ్‌ రక్కసి ఇపుడు మ‌రింత పెరిగిపోతోంది. హాస్ట‌ల్‌ లో చ‌దివుతూనే ఎవరెస్టు శిఖరం అధిరోహించ‌డం ద్వారా ప్రపంచంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఆనంద్‌ కూడా ర్యాగింగ్‌ బాధితుడయ్యాడు. త‌న స‌త్తాతో సీటు సంపాదించుకున్న ఆనంద్ నిజాం కాలేజీలో ర్యాగింగ్ బాధితుడు అయ్యాడు.

నిజాం కళాశాలలో ఆనంద్ బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజులాగే కళాశాలకు వెళ్లగా...అక్కడే ఉన్న‌ పలువురు సీనియర్‌ విద్యార్థులు ఆనంద్‌ ను అడ్డగించారు. ప్రారంభంలో నామమాత్రంగా చిన్నచిన్న ప్రశ్నలు అడిగి ఆ త‌ర్వాత‌ విసిగించడం మొదలెట్టారు. దీంతో ఆనంద్‌ 'అన్న నాకు పని ఉంది' అని చెప్పినా.. విడిచిపెట్టలేదని స‌మాచారం. సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో 'నీ మోహమేనా ఎవరెస్టు ఎక్కింది' అంటూ అవహేళన చేస్తూ దాడి చేసినంత పనిచేశారు.

క‌ల‌త చెందిన ఆనంద్ ఎవ‌రెస్టును అధిరోహించ‌డంలో అండ‌గా నిలిచిన‌ రాష్ట్ర గురుకుల కార్యదర్శి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కు - కళాశాల ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కళాశాల పరువు పోతుందనే భయంతో ప్రిన్సిపాల్‌ తాను మాట్లాడతానని స‌ర్దిచెప్పినట్టు సమాచారం. అయిన‌ప్ప‌టికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మ‌రుస‌టిరోజు వ‌ర‌కు చూసిన ఆనంద్‌ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కు ఫిర్యాదు చేశారు. ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సైతం అధికారులతో మాట్లాడటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

ఆనంద్‌ తో పాటు సీనియర్‌ విద్యార్థులతోనూ పోలీసులు మాట్లాడినట్టు స‌మాచారం. ఆనంద్ ఫిర్యాదు మేరకు నిజనిర్ధారణ కోసం ఓయూ ప్ర‌త్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండురోజుల్లో కమిటీ నివేదిక ఆధారంగా విద్యార్థులపై చర్యలు తీసుకుంటార‌ని స‌మాచారం. దేశానికి పేరు తెచ్చిన విద్యార్థిపై ర్యాగింగ్‌ ఘటన బాధాకరమే. అధికారులు ఈ విష‌యంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.