Begin typing your search above and press return to search.

దేశం మీకు ఇచ్చిన అప్పు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   1 March 2016 9:47 AM GMT
దేశం మీకు ఇచ్చిన అప్పు ఎంతో తెలుసా?
X
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలనుకుంటారు. ఎంత పేదవాడైనా.. తన స్తోమతకు తగ్గట్లుగా ఎంతోకొంత సంపాదించి.. బిడ్డలకు ఇచ్చి సంతృప్తి చెందుతాడు. అదేం దరిద్రమో కానీ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా.. ఇంతమంది ప్రధానమంత్రులు దేశాన్ని పాలించినా.. దేశ ప్రజలకు ఆస్తులు ఇవ్వటం తర్వాత.. అప్పులు మాత్రం భారీగా పెంచేస్తున్నారు.

అభివృద్ధి చేయటం మంచిదే. కానీ.. ఆ పేరిట ఇష్టారాజ్యంగా అప్పులు ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న విషయాన్న మర్చిపోకూడదు. దేశంలో అప్పుడు కన్ను తెరిచిన చిన్నారి నుంచి.. పండు ముదసలి వరకూ దేశంలోని ప్రతి ఒక్కరి నెత్తి మీద పాలకులు పుణ్యమా అని ఉన్న అప్పు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. మాటల్లో కోటలు దాటించే నేతలు ప్రధానమంత్రులైనా.. దేశ ప్రజల మీద ఉన్న రుణభారం అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గటం లేదు.

తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమయంలోనే దేశ ప్రజలకు పాలకులు ఇచ్చిన ఆస్తిలాంటి అప్పు అంకె చూస్తే హడలిపోవాల్సిందే. మన పాలకుల సామర్థ్యం.. ప్రజలకు ఇస్తున్న అప్పుల అంకెను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం దేశానికి ఉన్న అప్పు మొత్తం చూస్తే.. అక్షరాల 73,14,991 కోట్లు. భారతదేశ జనాభా 130 కోట్లుగా లెక్కేసి.. ఈ మొత్తం అప్పును పంచితే.. ఒక్కో తల మీద వచ్చే అప్పు రూ.56,269గా తేలుతుంది. మన ప్రభుత్వాలు విదేశాల నుంచి తెచ్చిన ఈ అప్పు కొండలా పెరుగుతుందే తప్పించి తగ్గటం లేదు.

2011-12లో ఈ అప్పు 45.17లక్షల కోట్లు ఉంటే.. మోడీ ప్రధానిగా అయిన 2014-15లో రూ.62.78లక్షల కోట్లు ఉంది. 2015-16లో ఈ మొత్తం కాస్తా రూ.68.94లక్షల కోట్లు అయితే.. తాజాగా అది రూ.73.14లక్షల కోట్లకు చేరుకుంది. ఏడాదికేడాది అప్పు పెరగటమే కాదు.. తగ్గకపోవటం ఏమిటో..?