Begin typing your search above and press return to search.

చంద్రగ్రహణం తర్వాత నుంచి ప్రతి రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు

By:  Tupaki Desk   |   18 Nov 2022 10:30 AM GMT
చంద్రగ్రహణం తర్వాత నుంచి ప్రతి రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు
X
మిస్టరీ సినిమాకు మించినట్లుగా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు ఆ రాష్ట్రంలో అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రగ్రహణం తర్వాత నుంచి ఒక ఇంట్లో రాత్రి వేళలో మంటలు రేగటం.. వస్తువులు కాలిపోతున్న వైనం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఉత్తరాఖండ్ లో నైనీతాల్ జిల్లాలోని హల్ద్వానీలోని ఒక ఇంట్లో గడిచిన ఎనిమిది రోజులుగా వరుసగా రాత్రి వేళలో మంటలు చెలరేగుతున్న వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరుగుతుందన్న విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.

బాధిత కుటుంబం చెబుతున్న దాని ప్రకారం చంద్రగ్రహణం చోటు చేసుకున్న రాత్రి నుంచి ప్రతి రోజూ ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతున్నారు. నవంబరు 8న చంద్రగ్రహణం చోటు చేసుకోవటం.. ఆ తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకోవటం తెలిసిందే. ఆ తర్వాత నుంచి రాత్రి అయితే చాలు ఇంట్లో మంటలు రేగుతున్నాయి. దీంతో భయానికి గురైన సదరు కుటుంబం.. విద్యుత్ శాఖ అధికారుల్ని పిలిపించి ఇంటికి ఉన్న కరెంటు కనెక్షన్ ను తొలగించారు.

ఆ తర్వాత కూడా ఇంట్లోని ఎలక్ట్రికల్ బోర్డులు.. వైర్లు కాలిపోతున్నాయి. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేకున్నా కూలర్ లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రేగటంతో ఆందోళనకు గురవుతున్నారు. చివరకు విద్యుత్ శాఖ సాయంతో ఇంటికి ఎర్త్ ఏర్పాటు చేసినా.. మంటలు మాత్రం ఆగటం లేదు.

ఇంట్లో ఉంచి కూలర్ కాలిపోవటంతో పాటు.. పరుపులు.. బీరువాలో ఉంచిన బట్టలు తగలబడుతున్నాయి. ఇలా రోజుకోసారి రాత్రి వేళ మంటలు రేగటం.. మంటలు అంటుకోవటం మిస్టరీగా మారింది. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఏమిటన్నది చెప్పలేకపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.