Begin typing your search above and press return to search.

అందరికీ పవన్ కళ్యాణే కావాలి... ఒక్క జగన్ కి తప్ప...?

By:  Tupaki Desk   |   12 Nov 2022 1:11 AM GMT
అందరికీ పవన్ కళ్యాణే కావాలి... ఒక్క జగన్ కి తప్ప...?
X
ఆయన పవర్ స్టార్. వెండి తెర మీద అలా కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు తెప్పించే పవర్ ఫుల్ హీరో. ఆయన అంటే ఫ్యాన్స్ పడి చస్తారు. అది నిజం. వారి అభిమానం అలాంటిది. అదే పవన్ కళ్యాణ్ బయట రాజకీయాల్లో చూసిన వీర లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయాల్లో ఢక్కా మెక్కీలు తిన్న వారు, యోధానుయోధులు కూడా పవన్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ తోనే అంటున్నారు. ఆయన్నే కోరుకుంటున్నారు.

పవన్ మా వెంటే అంటున్నారు. పవన్ వెంట మేము అని కూడా చెబుతున్నారు. నిజంగా ఇది గొప్ప అరుదైన చరిష్మాగా చూడాలి. నిజానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వారు అంతకంటే కాదు, కానీ ఆయనపైన రాజకీయ జీవులకు ఉన్న ఆదరణ ఎలాంటిది అంటే ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలను చూస్తే అర్ధమవుతుంది. ఆయన తమ వైపు రావాలని వారు మనసారా కోరుకుంటారు.

పవన్ కోసం రెడ్ కార్పెట్ పరుస్తారు. అందుకే పవన్ కోసం ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అత్యంత బిజీ షెడ్యూల్ లో సైతం అపాయింట్మెంట్ ఇచ్చారు. అరగంటకు పైగా ముచ్చటించారు. దటీజ్ పవన్ అనిపించారు. ఇక పవన్ కోసం కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఆయన బస చేసిన హొటల్ వద్దకు తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు వచ్చి మరీ నలభై నిముషాలకు పైగా మాట్లాడి వెళ్లారు.

పవన్ తో తాము కలసి ఏపీలో రాజకీయ పోరాటాలు చేస్తామని అంటూ మీడియాకు చంద్రబాబు చెప్పుకున్నారు. ఇక పవన్ మాతో రావాలని ఏపీలో ఉభయ వామపక్షాలు గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పటం లో బాధితుల పరామర్శ కోసం పవన్ వెళ్తే అక్కడికి వచ్చిన సీపీఎం నాయకుడు మధు పవన్ తో కలసి మాట్లాడారు. పవన్ తో చేతులు కలిపి ప్రజా పోరాటాలు చేయాలని ఆయన చూస్తున్నారు.

అదే విధంగా చూస్తే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామక్రిష్ణ కానీ పవన్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. పవన్ కల్యాణ్ తమ వెంట రావాలని బీజేపీని వీడి తంతో జట్టు కట్టాలని వారు బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఏమీ తీసిపోదు. ఆ పార్టీ కూడా పవన్ కూటమి కడితే చేరేందుకు సిద్ధమే అంటుంది.

ఇలా ఎవరిని చూసినా ఏ పార్టీని కదిలించినా పవన్ మావాడు. ఆయన మాతో ఉంటారు, ఉండాలి అని గట్టిగా కోరుకుంటారు. అంతలా ఏపీ రాజకీయాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. పవన్. అవును ఆయన నిజాయతీ కమిట్మెంట్. ఆయన పోరాటపటిమ, ఆయన దమ్ము, ధైర్యం ఇవే అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అందుకే పవన్ తో తాము ఉండాలని ఆయన అండతో తమ రాజకీయ పండాలని అంతా కోరుకుంటున్నారు. ఇక్కడ చిత్రమేంటి అంటే ఇంతమంది పవన్ని కోరుకుంటున్నా ఆయనతో రాజకీయంగా గిట్టని వారు ఒక్కరే నాయకుడు ఉన్నారు. అతనే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. ఆయనకు మాత్రం పవన్ అంటే వద్దు అనే అంటారు. పవన్ పేరు కూడా పలకడానికి ఇష్టపడని నాయకుడిగా జగన్ ఉంటారు.

అయితే ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. ఇద్దరూ దాదాపుగా ఒకే ఏజ్ కలిగిన వారు. ఇద్దరూ యువ నాయకులు. ఇద్దరూ సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయాలనుకుంటున్న వారు. ఇద్దరూ సీఎం సీటు కోసమే గురి పెట్టిన వారు. అందుకే ఈ ఇద్దరి మధ్యనే అత్యంత భీకరమైన రాజకీయ వైరం సాగుతోంది అని విశ్లేషించాలి.