Begin typing your search above and press return to search.

పిల్లలకు బొమ్మలుకొనే ప్రతి ఒక్కరూ ఇది చదవాల్సిందే

By:  Tupaki Desk   |   23 Dec 2019 7:00 AM GMT
పిల్లలకు బొమ్మలుకొనే ప్రతి ఒక్కరూ ఇది చదవాల్సిందే
X
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్క కుటుంబం ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ఒకట్రెండు బొమ్మల్ని తప్పనిసరిగా కొనటం మామూలే. మరి.. ఇలా కొనే బొమ్మలకు సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ లో లభించే బొమ్మలకు సంబంధించి భారతీయ నాణ్యత మండలి తాజాగా వెల్లడించిన విషయాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ప్రాణం లేని బొమ్మల్ని పిల్లలు చాలా ఇష్టంగా వాడుకోవటమే కాదు.. వాటితో నిత్యం ఆడుకుంటూ ఉంటారు. కానీ.. అలా దొరికే బొమ్మలకు సంబంధించి చాలావరకు నాణ్యత లేనివేనని చెబుతున్నారు. భారత్ కు దిగుమతి అయ్యే బొమ్మల్లో దాదాపు 67 శాతం ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు. ఢిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బొమ్మల్ని పరీక్షించగా.. అందులో 66.9 వాతం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి లేవన్న విషయాన్ని గుర్తించారు.

కేవలం 33 శాతం బొమ్మలు మాత్రం అన్ని పరీక్షల్లో నెగ్గటం గమనార్హం. బొమ్మల తయారీలో వినియోగించే భయంకరమైన రసాయనాల వల్ల పేలుడు స్వభావంతో పాటు.. క్యాన్సర్ కారకాలతో ఉన్నాయని చెప్పారు. భద్రత పేరుతో అధికస్థాయిలో ఫ్తాలెట్.. భారీ మెటల్ ను ఉపయోగిస్తున్నందున 30 శాతం ప్లాస్టిక్ బొమ్మలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు చెప్పారు.

85 శాతం చైనా ఉత్పత్తుల్ని శ్రీలంక.. మలేషియా.. జర్మనీ.. హాంగ్ కాంగ్.. అమెరికా దేశాలు దిగుమతి చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. బొమ్మలకు నాణ్యత పరీక్షలు తప్పనిసరి అని.. యాంత్రిక టెస్టుల్లో ఫెయిల్ అయిన బొమ్మలు పిల్లలకు చర్మవ్యాధులు కలుగజేయటమే కాదు.. అందులో వాడిన హానికారమైన రసాయనాలతో క్యాన్సర్ కు కారణంగా మారతాయని చెబుతున్నారు.అందుకే చూసినంతనే కంటికి నచ్చిన బొమ్మను కొనటానికి బదులుగా.. నాణ్యతా పరమైన జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా? అన్న వివరాల్ని చూసుకున్నాకే కొనుగోలు చేయటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.