Begin typing your search above and press return to search.

పవన్ యాత్రకు రథం సిద్ధం.. వైరల్ ఫొటో

By:  Tupaki Desk   |   7 Dec 2022 11:56 AM GMT
పవన్ యాత్రకు రథం సిద్ధం.. వైరల్ ఫొటో
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్రకు రంగం సిద్ధమైంది. ఎన్నికలకు ముందు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.ఇప్పటికే బస్సు యాత్రను ప్రకటించిన పవన్ అన్నట్టుగానే తన బస్సును రెడీ చేశారు. ఈ బస్సు అచ్చం నాడు రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ యాత్రలో ఉపయోగించిన బస్సులాగానే ఉండడం విశేషం.

పవన్ కళ్యాణ్ ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఇకనుంచి పార్టీ పటిష్టత కోసం జనంలోకి వెళ్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచిస్తారని అంటున్నారు.

పవన్ కల్యాణ్ యాత్ర కోసం బస్సు సిద్ధమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆ బస్సును పరిశీలిస్తూ దానితో ఫొటోలు దిగి రెడీ అయిన ఆ వాహనాన్ని చూపించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేసిన బస్సు ఫొటోలు వైరల్ అయ్యాయి.

బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. బస్సు యాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను వినే అవకాశం ఉన్నందున ఈ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక గణనీయమైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి ఓడారు. ఆయన పార్టీ ఒకే సీటును గెల్చుకుంది. కానీ ఈసారి అలా కాకుండా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. అందుకు అవసరమైన సమీకరణాలను ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా కాపునేతలతో పాటు ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సమీకరణం తెరమీదకు తెచ్చే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ లకు రెండు సామాజిక వర్గాలు అండగా నిలిచే అవకాశం ఉన్నందున ఇప్పుడు జనసేన కూడా ఆ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

బస్సు యాత్రలో ప్రతినియోజకవర్గంలో పర్యటించి అక్కడ జనసేన బలోపేతం చేసి నియోజకవర్గ ఇన్ చార్జీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సు రెడీ కావడంతో ఇక యాత్రకు రూట్ మ్యాప్ మాత్రమే మిగిలి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.