Begin typing your search above and press return to search.

ఈవీఎంల‌పై క్వ‌శ్చ‌న్ చేస్తే జైలు రూల్ పై కోర్టుకు!

By:  Tupaki Desk   |   29 April 2019 10:45 AM GMT
ఈవీఎంల‌పై క్వ‌శ్చ‌న్ చేస్తే జైలు రూల్ పై కోర్టుకు!
X
మీకు ఏదైనా విష‌యం మీద సందేహం వ‌చ్చింది. ఆ సందేహాన్ని వ్య‌క్తం చేసిన‌ప్పుడు.. ఆ సందేహం స‌రైన‌దేన‌ని నిరూపించ‌కుంటే జైలుశిక్ష వేస్తానన్న రూల్ ఉంటే ఎలా స్పందిస్తారు? సందేహం వ్య‌క్తం చేయ‌టం ఎందుకు? నిరూపించ‌టం ఎందుకు?.. అన్న ప్ర‌శ్న మీ నోటి నుంచి వ‌స్తుంది. ఎన్నిక‌ల వేళ‌.. కొత్త కొత్త అంశాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఈవీఎంల ప‌ని తీరు మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. ఈవీఎంల ప‌ని తీరు మీద ఎవ‌రైనా సందేహాన్ని వ్య‌క్తం చేస్తే.. వారి సందేహాన్ని నిరూపించ‌కుంటే ఆర్నెల్లు జైలుశిక్ష విధిస్తారంటూ అధికారులు చెప్పిన వైనం విస్మ‌యానికి గురి చేసేలా మారింది.

సందేహాన్ని నిరూపించ‌కుంటే జైలుశిక్షా? అంటూ హాట్ చ‌ర్చ నేప‌థ్యంలో ఈ నిబంధ‌న‌ను మార్చాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లైంది. ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల్లోని సెక్ష‌న్ 49ఎంఏ ప్ర‌కారం ఈవీఎంల‌లో లోపాలు ఉన్నాయ‌ని ఫిర్యాదు చేసిన వ్య‌క్తి.. ఆ విష‌యాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఆ వ్య‌క్తి చేసిన ఆరోప‌ణ త‌ప్ప‌ని రుజువైన ప‌క్షంలో సెక్ష‌న్ 177 ప్ర‌కారం విచార‌ణ‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆ సెక్ష‌న్ ప్ర‌కారం త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన వ్య‌క్తికి ఆర్నెల్లు జైలుశిక్ష‌.. లేదంటే వెయ్యి జ‌రిమానా లేదంటే రెండింటిని క‌లిపి విధించే వీలుంది. ఓటు వేసిన త‌ర్వాత వీవీ ప్యాట్ లో క‌నిపించే స్లిప్పు తాను ఓటు వేసిన పార్టీకి కాక‌.. మ‌రో పార్టీకి వేశార‌న్న అనుమానం క‌లిగింద‌ని అనుకుందాం. దానిపై ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేస్తే.. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్య‌త స‌ద‌రు ఫిర్యాదుచేసిన వ్య‌క్తిపై ప‌డుతుంది. ప్రాక్టిక‌ల్ గా చూస్తే అది సాధ్యం కాదు. అలాంట‌ప్పుడు ఫిర్యాదు చేసిన వ్య‌క్తి రూల్ కి భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఎన్నిక‌ల అధికారి ఫిర్యాదు చేస్తే.. జైలుశిక్ష‌కు ఛాన్స్ ఉంది.

లాజిక్ గా చూసిన‌ప్పుడు ఈ రూల్ లో అర్థం లేద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సునీల్ ఆహ్యా అనే వ్య‌క్తి రూల్ బుక్ లోని రూల్ ను మార్చాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈసీ రూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పైనా.. పార‌ద‌ర్శ‌క‌త మీదా అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యే వీలుంద‌ని పిటిష‌నర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ రూల్ కార‌ణంగా ఈవీఎంలు.. వీవీ ప్యాట్ ల‌లో తేడా జ‌రిగినా ఫిర్యాదు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. ఈసీ వివ‌ర‌ణ కోరింది. దీనిపై వాద‌న‌లు జ‌రిగితే.. కొత్త అంశాలు తెర మీద‌కు రావ‌టం ఖాయంగా చెప్ప‌క త‌ప్ప‌దు.