Begin typing your search above and press return to search.

సైనికుడి ఫిర్యాదుతో తల పట్టుకున్న ఏపీ పోలీసులు

By:  Tupaki Desk   |   4 May 2016 10:17 AM GMT
సైనికుడి ఫిర్యాదుతో తల పట్టుకున్న ఏపీ పోలీసులు
X
సినిమాల్లోనూ.. కామెడీ షోల్లోనూ కొన్ని సీన్లు చూస్తుంటాం. నిజంగా అలాంటివి జరుగుతాయా? అన్న సందేహం కలుగుతుంది. కానీ.. అలాంటివేంటి.. వాటికి మించిన సీన్లు కొన్ని చోటు చేసుకుంటాయన్న విషయం తాజా ఉదంతం గురించి వింటే అర్థమవుతుంది. ఏపీలోని గుంటూరు జిల్లా పోలీసుల దృష్టికి వచ్చిన ఒక వెరైటీ ఫిర్యాదుతో వారేం చేయాలో తోచక తల పట్టుకున్నారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక.. ఏ సెక్షన్లో కేసు నమోదు చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ విచిత్ర ఘటనలోకి వెళితే..

సైన్యంలో పని చేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్నారు.ఆయనకు ఒక కూతురు.. కొడుకు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసిన ఆయన కూతుర్ని అత్తారింటికి పంపారు. కొడుకు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు. కూతురికి కూతురు పుట్టింది. ఆమెకు పెళ్లి అయి అత్తారింటికి వెళ్లింది. ఇక్కడి వరకూ కథ ఓకే.

కట్ చేస్తే.. పది రోజుల కిందట మనమరాలు తన భర్తతో కలిసి తాత ఇంటికి వచ్చింది. మనమరాలు వచ్చిందన్న సంతోషంతో ఉన్న వారికి.. పది రోజులైనా వచ్చిన వారు వెళ్లకపోవటం.. వయసు మీద పడ్డ మాజీ సైనికుడి సతీమణి వారికి మర్యాదలు చేయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎప్పుడు ప్రయాణం అన్న మాటకు సమాధానం చెప్పని మనమరాలు.. ఇంటిని వదిలి వెళ్లటం లేదని.. అదేంటని అడిగితే.. ఆస్తిలో వాటా అడుగుతోందని సదరు మాజీ సైనికుడు వాపోతున్నారు. ఇంట్లో తిష్ట వేసుకున్న మనమరాలిని ఇంటి నుంచి పంపాలంటూ మాజీ సైనికుడి ఫిర్యాదును ఏ విధంగా పరిష్కరించాలో అర్థంకాక తాడేపలల్ పోలీసులు కిందామీదా పడుతున్నారు.