Begin typing your search above and press return to search.

సీబీఐలో ప‌ని చేసినందుకు సిగ్గు ప‌డ‌ట‌మా?

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:31 AM GMT
సీబీఐలో ప‌ని చేసినందుకు సిగ్గు ప‌డ‌ట‌మా?
X
సీబీఐ అన్న మూడు అక్ష‌రాలు విన్నంత‌నే చాలామందిలో క‌లిగే ఫీలింగ్‌కు భిన్న‌మైన ప‌రిణామాలు గ‌డిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ మీద ఉన్న మ‌ర్యాద‌.. గౌర‌వాలు మంటగ‌లిసిన దుస్థితి. నీతులు చెప్పే మోడీ హ‌యాంలోనే ఈ ద‌రిద్రాల‌న్నీ చోటు చేసుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. చ‌రిత్ర‌లో మ‌రెప్పుడు జ‌ర‌గ‌న‌న్ని ప‌రిణామాలు గంట‌ల వ్య‌వ‌ధిలో చోటు చేసుకున్నాయి.

దీంతో ఇంత‌కాలం సీబీఐ మీద దేశ ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కం కాస్తా భ్ర‌మ‌గా మారిపోవ‌ట‌మే కాదు.. రాజ‌కీయ క్రీనీడ‌లో సీబీఐ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిన తీరు చూసిన‌ప్పుడు అయ్యో అనుకోకుండా ఉండ‌లేం. సీబీఐ చీఫ్ నియామ‌కం రాత్రి వేళ‌లో చేయ‌టం.. అది స‌రిపోన‌ట్లు ఆత్రం కాక‌పోతే తెల్ల‌వారుజామున 1.45 గంట‌ల వేళ సీబీఐ చీఫ్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టం ఏమిటి? ఆ టైంలో సీబీఐ కార్యాల‌యం చుట్టూ పోలీసుల ప‌హ‌రా పెట్టించ‌టం ఏమిటి? బాధ్య‌త‌లు స్వీక‌రించారో లేదో ఏదో ఆప‌రేష‌న్ అన్న‌ట్లుగా సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో అంత‌ర్గ‌తంగా త‌నిఖీలు నిర్వ‌హించ‌టం ఏమిటి? పొద్దున్నే ఆఫీసుకు వ‌చ్చిన సీబీఐ ఉద్యోగుల్ని మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఆఫీసుకు రావాల‌ని తిప్పి పంప‌టం ఏమిటి? ఇవ‌న్నీ చూసిన‌ప్పుడు సీబీఐ ఎంత ఛీప్ అయిపోయింద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

సీబీఐలో అధికార‌ప‌క్షం వేలు పెట్ట‌టం మామూలే అయినా.. ఆ మొత్తం వ్య‌వ‌స్థ మీద అనుమానం క‌లిగేలా.. చుల‌క‌న చేసే ప‌రిణామాలు ఈ స్థాయిలో ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేదంటారు. ఇది దేశ జ‌నుల మాట మాత్ర‌మే కాదు.. తాజాగా మాజీ సీబీఐ చీఫ్ కూడా ఇదే మాట‌ను త‌న‌దైన శైలిలో చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింది.

స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌గా పేరున్న సీబీఐని ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారు చిన్నాభిన్నం చేయ‌ట‌మే కాదు.. ఆ సంస్థ‌కు ఉన్న పేరు ప్ర‌ఖ్యాతుల్ని మంట క‌లిపేలా చేసింద‌న్న విమ‌ర్శ‌ను మూట‌గ‌ట్టుకుంది. తాజాగా చెన్నైలో సీబీఐ- ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలు అనే అంశంపై ఒక స‌ద‌స్సును నిర్వ‌హించారు. దీనికి సీబీఐ మాజీ చీఫ్ ర‌ఘోత్త‌మ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

తాను సీబీఐలో 36 ఏళ్లు ప‌ని చేసి రిటైర్ అయ్యాన‌ని.. సంస్థ ప‌రువు ప్ర‌తిష్ఠ‌లు ఇంత‌లా దిగ‌జారిపోవ‌టం ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాను సీబీఐలో ప‌ని చేశాన‌ని చెప్పుకోవ‌టానికి సిగ్గుప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. సీబీఐ పాల‌నా వ్య‌వ‌హారాల్లో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవ‌టం.. సంస్థ అధ్య‌క్షుడ్ని మార్చ‌టంతో సంస్థ‌కున్న ప‌రువు మంట‌గ‌లిసింద‌న్నారు.

సీబీఐలో ఉన్న‌తాధికారిని మార్చ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ క‌ష్టంగా ఉండేద‌ని.. అలాంటిది బీజేపీ నేత‌ల కార‌ణంగా సునాయాసంగా సంస్థ చీఫ్ ను మార్చేశార‌న్నారు. తాజా ప‌రిణామాల‌తో సీబీఐకి ఉన్న సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ పేరు కాస్తా.. కంట్రోల్డ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అన్న‌గా మారింద‌న్నారు. ఇక‌పై సీబీఐని అలా పిలిస్తే మంచిద‌ని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ అదే ప‌నిగా మోడీ భ‌జ‌న చేసేటోళ్లంతా కాస్త మ‌న‌సు పెట్టి ఆలోచిస్తే దేశానికి అంతో ఇంతో మంచి జ‌రుగుతుందేమో?