Begin typing your search above and press return to search.

పెట్రోల్ ధ‌ర‌ల‌పై ధ‌ర్నా చేసే ద‌మ్ము చంద్ర‌బాబుకు లేదా?

By:  Tupaki Desk   |   3 Aug 2021 7:30 AM GMT
పెట్రోల్ ధ‌ర‌ల‌పై ధ‌ర్నా చేసే ద‌మ్ము చంద్ర‌బాబుకు లేదా?
X
ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారికి ఒక కీల‌క‌మైన ప్ర‌శ్న స్ఫురిస్తోంది. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి..చంద్ర‌బాబు ఏమ‌య్యారు? ఎక్క‌డున్నారు? అని! ఎం దుకంటే.. దేశం మొత్తం ఇప్పుడు ఏక గొంతుక‌మారి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌వ‌హారంపై దుమ్మెత్తి పోస్తోం ది. ఎందుకంటే.. ఏమి కొన‌లేని ప‌రిస్థితి, ఏమీ తిన‌లేని ప‌రిస్థితి నెల‌కొన‌డ‌మే! ఒక‌వైపు పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు నిరంత‌రం పెరుగుతున్నాయి. దీంతో.. అన్ని ధ‌ర‌ల‌పైనా.. ప్ర‌భావం ప‌డుతోంది.

మ‌రో వైపు.. క‌రోనా నేప‌థ్యంలో ప‌నులు లేక ఉపాధి పోయి.. ఉద్యోగాలు పోయి.. స‌గం స‌గం వేత‌నాల‌తో జీవితాలు వెళ్ల‌దీస్తున్న కుటుంబాలు.. ఈ ధ‌ర‌ల‌తో అల్లాడిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనికితోడు.. క‌రోనా తో సంభ‌వించిన ప్ర‌భుత్వ ఆదాయ న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తుండ‌డం ఈ క్ర‌మంలో చాలా మటుకు ధ‌రల‌ను పెంచేయడం కార‌ణంగా.. మ‌రింత‌గా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ట్యాక్సులు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విప‌క్షాలు.. తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు కూడా కొన్ని మిన‌హా.. మోడీ విధానాల‌ను ఎండ‌గ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒకే తాటిపైకి వ‌చ్చి.. మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును నిర‌సిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని దింప‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌ని.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వంటివారు ప్ర‌క‌టిస్తున్నారు కూడా. అయితే.. దేశ‌వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున మోడీపై విప‌క్షాలు చెల‌రేగుతున్నా.. ఏపీకి సంబంధించిన కీల‌క నాయ‌కుడు.. కేంద్రంలో చ‌క్రం తిప్పాన‌ని.. ప్ర‌ధానుల‌ను సైతం నిర్ణ‌యించాన‌ని.. చెప్పుకొనే చంద్ర‌బాబు మాత్రం .. ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు.


ఇప్పుడు చంద్ర‌బాబు మౌనంపైనే అనేక విమ‌ర్శ‌లు, విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. విప‌క్షాలన్నీ.. మోడీని ఎండ‌గ‌డుతుంటే.. చంద్ర‌బాబు మౌనం ఎందుక‌ని అంటున్నారు. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కు కొద్ది నెలల ముందు నుంచి కూడా చంద్ర‌బాబు.. మోడీ కేంద్రంగా ప‌దునైన విమ‌ర్శ‌లు చేసేవారు. మోడీని అధికారంలోకి రాకుండా చేస్తాన‌ని.. మోడీ హ‌ఠావో.. నినాదం దేశం మొత్తం మార్మోగాల‌ని కూడా అప్ప‌ట్లో ఊరూవాడా చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. మోడీకి వ్య‌తిరేకంగా.. దేశంలో ఎక్క‌డ ఎలాంటి చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా హాజ‌రయ్యారు.

అలాంటిది ఇప్పుడు ఆయ‌న వ్యూహం మారిందా? అనే చ‌ర్చ జోరుగా జరుగుతోంది. చంద్ర‌బాబు.. నోరు మెద‌ప‌డం లేదు.. అంటే ఆయ‌న సేఫ్ గేమ్ ఆడుతున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుకు బాబు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్న స‌మ‌యంలో.. ఇప్పుడు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రి.. ఆయ‌నపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు.. ఏం చేస్తారో చూడాలి.