Begin typing your search above and press return to search.

వైర‌ల్ః టీమిండియాలో స్టార్ క్రికెట‌ర్ల ఆధిప‌త్యం.. బీసీసీఐకి కోచ్ లేఖ‌!

By:  Tupaki Desk   |   16 May 2021 12:30 AM GMT
వైర‌ల్ః టీమిండియాలో స్టార్ క్రికెట‌ర్ల ఆధిప‌త్యం.. బీసీసీఐకి కోచ్ లేఖ‌!
X
ఇండియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌ ఆధిప‌త్యం పెరిగిపోయింద‌ని మాజీ కోచ్ డ‌బ్ల్యూవీ రామ‌న్ బీసీసీఐకి లేఖ రాసిన‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారం క‌ల‌క‌లం రేపుతోంది. సౌర‌వ్ గంగూలీతోపాటు, నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ కు సైతం ఈ-మెయిల్ పంపించిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ఈ మ‌ధ్య‌నే మ‌హిళా జ‌ట్టు కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు రామ‌న్. ఆయ‌న స్థానంలో టీమిండియా మాజీ ఆట‌గాడు.. మాజీ మ‌హిళా జ‌ట్టు కోచ్ ర‌మేష్ ప‌వార్ ను మ‌రోసారి కోచ్ గా నియ‌మితుల‌య్యారు. తాను ప‌ద‌వి వ‌దిలిపోతున్న వేళ రామ‌న్ లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. మ‌హిళా జ‌ట్టులో కొంద‌రు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఆధిప‌త్యం చెలాయిస్తున్నార‌ని ఆ లేఖ‌లో పేర్కొన్న‌ట్టు స‌మాచారం. జ‌ట్టుకన్నా ఎవ‌రూ ఎక్కువ కావొద్దంటూ ప‌రిస్థితి తీవ్ర‌త‌ను ఘాటుగానే వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ లేఖ‌ మిథాలీ రాజ్ తోపాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు సీనియ‌ర్ల‌ను ఉద్దేశించిన‌దే కావొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో కోచ్ గా ఉన్న స‌మ‌యంలో ర‌మేష్ ప‌వార్ - మిథాలీ రాజ్ మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ గొడ‌వ కార‌ణంగానే ర‌మేష్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

ఇప్పుడు ర‌మేష్ ప‌వార్ మ‌రోసారి కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌డుతుండ‌డం.. ఇదే స‌మ‌యంలో మాజీ కోచ్ ఈ త‌ర‌హా లేఖ రాయ‌డంతో.. ముందు ముందు ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయోన‌నే చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లో మ‌హిళా జ‌ట్టు ఇంగ్లండ్ లో ప‌ర్య‌టించ‌బోతోంది. టెస్టు, వ‌న్డే, టీ20 మూడు ఫార్మాట్ల‌లోనూ సిరీస్ లు ఆడ‌నుంది. టెస్టు, వ‌న్డే జ‌ట్టుకు మిథాలీ కెప్టెన్ గా ఉంది. మ‌రి, కొత్త కోచ్‌.. పాత వివాదం నేప‌థ్యంలో అంతా సాఫీగానే సాగుతుందా? అనేది చూడాల్సి ఉంది.