Begin typing your search above and press return to search.

సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన హర్షకుమార్

By:  Tupaki Desk   |   7 Feb 2020 11:00 AM GMT
సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన హర్షకుమార్
X
మాజీ ఎంపీ హర్షకుమార్ కు కోపం వచ్చింది. తాను అరెస్టు కావటం వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని నమ్ముతున్న ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యన జైలు నుంచి విడుదలైన నాటి నుంచి జగన్ మీద విమర్శలు..ఆరోపణల తీవ్రతను అంతకంతకూ పెంచుతున్నారు. జ్యుడీషియల్ సిబ్బందిని దూషించిన కేసులో ఆయనకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ కావటం.. ఆ తర్వాత 76 రోజుల పాటు కనిపించకుండా పోవటం తెలిసిందే.

తర్వాత.. ఆయన రాజమండ్రికి వచ్చారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి.. రిమాండ్ కు పంపారు. ఇదంతా జగన్ ప్రభుత్వం కారణంగానే జరిగిందని బలంగా నమ్ముతున్న ఆయన తన నోటికి పని చెబుతున్నారు. తరచూ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. జగన్ బాబాయ్ వివేకా హత్య వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో.. వివేకాను పదవి నుంచి దిగిపోవాలని జగన్ ఒత్తిడి తెచ్చారని.. జగన్ తనపై చేయి చేసుకున్నాడని వివేకానే చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయం సోనియా వరకు వెళ్లిందని.. మొదట్లో జగన్ కు వివేకా వ్యతిరేకంగా ఉన్నారని.. బయట ఉంటే ఏం జరుగుతుందో అన్న ఉద్దేశం తో ఆయన జగన్ పార్టీ లో చేరారన్నారు.

వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో జగన్ అడిగారని.. వివేకాను చంపింది కుటుంబ సభ్యులే అయి ఉంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని చెప్పారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబే ముద్దాయని జగన్ అన్నారని.. కచ్చలూరులో బోటు మునిగి 50 మంది చనిపోతే ముద్దాయి ఎవరు? – జగన్ బాధ్యుడు కాదా? అని ప్రశ్నించారు. తాను అడిగినవి తప్పా? అని ప్రశ్నించారు.

కచ్చులూరు ఘటనలో అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్న ఆయన.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పని ప్రభుత్వం.. తనపై రివర్స్ లో కేసులు పెట్టారన్నారు. అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్న శాఖే పడవ ప్రమాదానికి గురైందని.. ఆయన బాధ్యత వహించాలన్నారు. మంత్రి అవంతి.. స్వరూపానంద శిష్యుడు కావటం వల్లే చర్యలు తీసుకోలేదని.. బోటు ప్రమాదంలో మృతదేహాలు దొరక్కపోయినా డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు.

తమ జిల్లా కలెక్టర్ కొన్ని కేసుల్లో జగన్‌కు సహనిందితుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో జైలుకెళ్లొచ్చిన జగన్ కు తెలుసని.. పరిటాల రవి కేసులో కుట్రదారు కొండారెడ్డిగా చెప్పారు. రిపబ్లిక్ డే రోజు జైలు నుంచి విడుదల అవుతానని ఎదురు చూశాడని.. సీఎం జగన్ తనను పట్టించుకోక పోవడంపై కొండా రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నాడని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి కొడుకు మినహా జగన్‌ కు ఏ అర్హత ఉందన్న హర్షకుమార్.. తాను అడుగుతున్నందుకే తాను గిట్టటం లేదన్నారు. తనను వ్యతిరేకించేవారిని హింసించాలని.. జైల్లో పెట్టించాలన్న ఉద్దేశం వైఎస్ కు ఉండేది కాదన్నారు. ప్రత్యర్థుల్ని వేధించాలని, కక్ష సాధించాలని, ఇబ్బంది పెట్టాలని వైఎస్ వెంపర్లాడేవారు కాదన్నారు. టీడీపీ హయాంలో 42 సార్లు తనపై ఆంక్షలు విధించారు కానీ.. వ్యక్తిగతం గా ఎప్పుడూ వేధించ లేదన్నారు. అలాంటిది జగన్ హయాంలో మాత్రం వ్యక్తిగతం గా టార్గెట్ చేశారన్నారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని తన కుమారుడు పని చేశాడని.. రాజధాని విషయంలో సీఎం జగన్ తప్పు చేస్తున్నారన్నారు.

మూడు రాజధానులు పిచ్చి ఆలోచన.. తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించారు. జగన్ సీఎంలా ఆలోచించడం లేదని..ఫ్యాక్షనిస్టులా ఆలోచిస్తున్నారన్నారు. అందుకే ప్రజావేదిక కూల్చారు.. ప్రజల్ని వేధిస్తున్నాడు. రాజధాని పై కమిటీలన్నీ జగన్ వేసుకున్నవే. బోస్టన్ కమిటీ అంటే ఎవరికి తెలుసు? కర్నులు లో హైకోర్టు పెడితే అభివృద్ధి జరుగుతుందా? విశాఖ ప్రజలు రాజధాని ని కోరుకోవడం లేదన్నారు. తనను కెలికినందుకు అంతకంతా అన్నట్లుగా హర్షకుమార్ తీరు ఉందని చెప్పక తప్పదు.