Begin typing your search above and press return to search.

మాజీ బ్యూరోక్రాట్ల‌కు ప‌ద‌వులు కావ‌లెను!

By:  Tupaki Desk   |   13 Nov 2017 9:46 AM GMT
మాజీ బ్యూరోక్రాట్ల‌కు ప‌ద‌వులు కావ‌లెను!
X
ఎలాంటి ప‌ని లేకుండా బ్యూరోక్రాట్లు ఉండ‌లేరు. అస‌లు ప‌నేమీ లేక‌పోతే అస్స‌లు వారికి మ‌న‌స్క‌రించ‌దు. ప‌ని కంటే కూడా స‌ర్వీసులో ఉన్నంత కాలం త‌మ‌కు ద‌క్కిన గౌర‌వ మర్యాద‌లు ఒక్క‌సారిగా తొల‌గిపోవ‌డం కూడా వారు జీర్ణించుకోలేని విష‌య‌మే. ఎందుకంటే... స‌ర్వీసులో ఉన్నంత కాలం నిత్యం ప‌నితో పాటు కారెక్కినా, దిగినా... డోర్ తీసి సెల్యూట్ చేసీ మ‌రీ ల‌భించే స్వాగ‌తాలు, రెడ్ కార్పెట్ వెల్‌ క‌మ్‌ లు ఒక్క‌సారిగా క‌నిపించ‌కుండా పోతే త‌ట్టుకోవ‌డం నిజంగానే కాస్తంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి. అలాగ‌ని జీవించి ఉన్నంత కాలం కూడా ప‌ని క‌ల్పించ‌డం దుస్సాధ్య‌మే క‌దా. మ‌రేం చేయాలి? ఇంకేం చేయాలి... రాజ‌కీయాలు ఉన్నాయిగా! నిజ‌మేనండోయ్ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతే... జీవించి ఉన్నంత కాలం కూడా చేతి నిండా ప‌ని, రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు ఖాయ‌మే. మ‌న‌కై మ‌న‌కు విసుగు క‌లిగే దాకా కూడా రాజ‌కీయాల్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

అంటే స‌ర్వీసు నుంచి రిటైర్ కాగానే... మ‌న బ్యూరోక్రాట్లంతా రాజకీయాల్లో చేరిపోవాల‌ని చెబుతారా? అని అడ‌గ‌మాకండి. ఎందుకంటే... ఎవ‌రో చెప్పేదాకా మ‌న రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఇంట్లోనే కాళ్లు చాపుకుని కూర్చునే ర‌కాలు కాదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి కాక‌పోయినా... త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉంటే... వారు ప‌రోక్షంగా ప‌ద‌వులు పొందేందుకు శ‌త‌థా య‌త్నిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం ఏపీలో రిటైర్డ్ ఐఏఎస్‌ - ఐపీఎస్ అధికారుల్లో కొంద‌రు చేస్తున్న య‌త్నాల‌ను చూస్తే... ఈ మాట నిజ‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. ఆ వివ‌రాల్లోకెళితే... ఏపీ డీజీపీగా చాలా కాలం పాటు ప‌నిచేసి ఏడాది క్రితం ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేవీ రాముడు గుర్తున్నారుగా. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వెంట‌నే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తార‌ని నాడు ప్ర‌చారం జ‌రిగినా... జేవీ రాముడు మాత్రం అంత సాహ‌సం చేయ‌లేక‌పోయారు.

అయితే త‌న మాట‌కు విలువిచ్చే టీడీపీనే అధికారంలో ఉన్న నేప‌థ్యంలో కాస్తంత విశ్రాంతి తీసుకున్న ఆయ‌న ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయారు. జేవీ రాముడు త‌ర‌హాలోనే ఆయ‌న కంటే కాస్తంత ముందుగా రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ఏకే ప‌రీడా - తెలంగాణ స‌ర్వీసులో రిటైర్ అయిన ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ - ఏపీ కేడ‌ర్‌ లోనే రిటైర్ అయిన ఐపీఎస్ సూర్య‌నారాయ‌ణ‌ - ఐఎఫ్ ఎస్ మ‌ల్లిఖార్జున‌రావు త‌దిత‌రులు కూడా ప‌ద‌వుల కోసం త‌మ వంతు య‌త్నాలు మొద‌లుపెట్టార‌ట‌. అయినా ఏ ప‌ద‌వి ఖాళీగా ఉంద‌ని జేవీ రాముడు రంగంలోకి దిగిపోయార‌న్న విష‌యానికి వ‌స్తే... రాష్ట్ర స‌మాచార క‌మిష‌న్ లో ప్ర‌ధాన క‌మిష‌నర్ ప‌ద‌వితో పాటు క‌మిష‌న‌ర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ పోస్టు కోసం జేవీ రాముడు య‌త్నిస్తున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. చంద్ర‌బాబు స‌ర్కారుకు కూడా ఈ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా... ఇంకా వేచి చూసే ధోర‌ణినే అవ‌లంబిస్తోంది.

అయినా ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు ఉండ‌గా... ఇలా నామినేటెడ్ ప‌దవి పైనే జేవీ రాముడు లాంటి వాళ్లు గురి పెట్ట‌డం వెనుక కూడా ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఒక్క‌సారి స‌మాచార క‌మిష‌న‌ర్ ప‌ద‌విలో చేరితే.. మంచి జీత‌భ‌త్యాల‌తో పాటు ఆరేళ్ల వ‌ర‌కు కూడా ప‌ద‌వికి ఢోకా ఉండ‌దు. అంటే ఓ పార్టీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ద‌వి చేప‌ట్టిన వ్య‌క్తులు... ప్ర‌భుత్వం మారినా కూడా ఆరేళ్ల వ‌ర‌కు ఎలాంటి ఢోకా లేకుండా కొన‌సాగుతారు. అంతేకాదండోయ్‌... స‌మాచార క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ద‌క్కితే... ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్థాయి గుర్తింపు ద‌క్కుతుంద‌ట‌. అందుకే జేవీ రాముడు, ఇత‌ర అధికారులు ఈ ప‌ద‌విపై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ ప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతాయో చూడాలి.