Begin typing your search above and press return to search.
సీబీఐ మాజీ జేడీ..ఇప్పుడు శ్రీమంతుడు
By: Tupaki Desk | 5 May 2018 10:39 AM GMTసీబీఐ మాజీ జేడీ - తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త అవతారం ఎత్తారు. పదవికి గుడ్ బై చెప్పిన అనంతరం ఆయన రాజకీయ నాయుడుడి రోల్ లోకి మారిపోతారని అంతా అనుకుంటుంటే ఆయన శ్రీమంతుడు అయిపోయారు. అవును రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని ప్రకటించిన మాజీ జేడీ ఈ క్రమంలో పలు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే తన స్వగ్రామంలో రైతులతో భేటీ అయి దానికి శ్రీకారం చుట్టారు. ఇదే కోవలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
సామాజికంగా వెనుకబడి ఉన్న సహలాలపుట్టుగను దత్తత తీసుకుంటున్నానని, గ్రామానికి పెద్దన్నలా ఉండి ప్రగతిబాట పట్టిస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ ప్రకటించారు. నెల రోజులలో ప్రణాళికను తయారు చేసి, గ్రామాభివృద్ధికి సిద్ధమవుతానని హామీ ఇచ్చారు.
‘రైతేరాజు-గ్రామ స్వరాజ్యమే ధ్యేయం’ పేరిట జిల్లాలో శ్రీకాకులం జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కవిటి మండలంలోని సహలాలపుట్టుగ గ్రామాన్ని ఆయన శుక్రవారం రాత్రి సందర్శించారు. జిల్లాలో ఆయన అయిదు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కవిటి మండలంలోని సహలాలపుట్టుగ గ్రామానికి రాత్రి బస కోసం చేరుకున్న ఆయన గ్రామస్థుల సమస్యలను విన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని - రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరూ మద్యం తాగవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమైన ఆయన వారి సమస్యలను విని స్పందించారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ప్రతిపాదించారు. కాగా, రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందే శ్రీమంతుడిగా తన పెద్దమనసును చాటుకున్నారని పలువురు చర్చించుకున్నారు.
ఇదిలాఉండగా.... చక్కెర కర్మాగారం తెరిపించేందుకు నేను సైతం అంటూ మాజీ జేడీ ముందుకు కదిలారు. దూసి గ్రామ రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లక్ష్మీనారాయణ అనంతరం మూతపడిన ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని సందర్శించి, అక్కడ కర్మాగారం కార్మికులు - రైతులు - వివిధ సంఘాల నాయకులతో మాట్లాడి అది మూతపడటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చక్కెర కర్మాగార సాధన సమితి దాన్ని తెరిపించేందుకు చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా సంతకం చేశారు. హిరమండలం మండలంలోని వంశధార నది గొట్టాబ్యారేజీ, వంశధార ఎడమ ప్రధాన కాలవను పరిశీలించేందుకు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పలువురు నిర్వాసితులు కలిశారు.