Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్య .. కారణం ఏంటంటే !

By:  Tupaki Desk   |   30 May 2020 8:50 AM GMT
మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్య .. కారణం ఏంటంటే !
X
విశాఖపట్టణం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్ నాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని పరవాడ మండలం నునపర్తి గ్రామంలోని పొలాల్లో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలాల్లో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న డ్రైవర్‌ను స్థానికులు గమనించారు. హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల మేరకు.. తన ఇంటి నిర్మాణాన్ని స్థానికంగా ఉన్న వాలంటీర్, వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారని వాట్సాప్‌ లో ఆడియో రికార్డ్ చేశాడు. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా గ్రామానికి చెందిన వాలంటీర్, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారన్నాడు. ఇంటి నిర్మాణం విషయంలో దొంగ డాక్యుమెంట్లతో తనను వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నాడు. తన ఆత్మహత్యకు ఎవరెవరు కారణమో పేర్లతో సహా తెలిపి, జరిగిన సంఘటనంతా వాట్సావ్‌ ఆడియో ద్వారా బయటపెట్టాడు. ఇతను 18 ఏళ్లగా బండారు సత్యన్నారాయణ మూర్తి దగ్గర డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు.

ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై స్పందించిన మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యానారాయణ తెలిపారు. మంచి వ్యక్తి అని, సొంత కొడుకులా చూసుకున్నామని కంటతడి పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని వలంటీర్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని , వలంటీర్ల వల్ల ఇంకెంత మంది చావాలని ప్రశ్నించారు?, అసలు వలంటీర్లు వేధించడమేంటి? అని నిలదీశారు.