Begin typing your search above and press return to search.

వైసీపీలోకి మాజీ మంత్రి మహీధర్ రెడ్డి

By:  Tupaki Desk   |   8 July 2018 7:33 AM GMT
వైసీపీలోకి మాజీ మంత్రి మహీధర్ రెడ్డి
X
దక్షిణాంధ్రలో వైసీపీ బలం మరింత పెరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు సీనియర్ నేతలు చేరుతుండడంతో మరింత బలపడుతోంది. నెల్లూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరికకు సిద్ధమవుతుండగా .. పొరుగునే ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా మరో మాజీ మంత్రి వైసీపీ కండువా కప్పుకొనేందుకు రెడీ అవుతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన నేత - మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలో తాను వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ను కలిసి వైకాపాలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ మేరకు ఆయన తన అనుచరుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. అవన్నీ పూర్తయ్యాక శనివారం తిరుపతిలో ఆయన వైసీపీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డి - వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన - తెలుగుదేశం పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని విమర్శలు గుప్పించారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన ఆయన - సాయి ఆశీస్సులు తనకు ఉన్నాయని - నియోజకవర్గ ప్రజలు - కార్యకర్తల అభీష్టం మేరకు వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. నిత్యమూ ప్రజలతో మమేకమై - వారి సమస్యలు తీర్చే ప్రయత్నం చేసే మహీధర్ రెడ్డి - వైకాపాలో చేరడం సంతోషంగా ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా ప్రకాశం జిల్లాకే చెందిన సీనియర్ లీడర్ కరణం బలరాం కూడా తెలుగు దేశం పార్టీలో ఇమడలేక వైసీపీలో చేరుతున్నట్లు టాక్. మహీధర్ - కరణం వంటి నేతలు చేరితో ప్రకాశం జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకోవడం ఖాయం. 2014లో వైసీపీ ఇక్కడ సగం స్థానాలను గెలుచుకుంది. అయితే.. అనంతరం కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. అయితే.. అప్పటి నుంచి టీడీపీలో యుద్ధాలు మొదలయ్యాయి. చంద్రబాబు ఫిరాయింపు నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో కరణం వంటి సీనియర్ నేతలు ఇమడలేకపోతున్నారు. అద్దంకిలో గత ఎన్నికల్లో కరణం కుమారుడు వెంకటేశ్ పై గొట్టిపాటి రవి కుమార్ స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ఆ తరువాత రవి టీడీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య నిత్యం పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీలో కరణం కుటుంబానికి సీటొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సీనియర్ లీడర్ జగన్ పార్టీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కరణం వైసీపీలో చేరితే అద్దంకి ఒక్కటే కాకుండా మరో రెండు మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.