Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు షాక్: దానం బాటలో మరో సీనియర్..
By: Tupaki Desk | 29 Jun 2018 7:51 AM GMTబెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఇప్పుడు అధికారం చుట్టూ నాయకులు తిరుగుతున్నారు . ఎవరు అధికారంలోకి వస్తే వారి పార్టీలోకి జంప్ చేసి హోదాను అనుభవించేందుకు రెడీ అయిపోతున్నారు.. ఇందులో పార్టీ పై ప్రేమలు - క్రమశిక్షణ లాంటి ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ప్రజాప్రతినిధుల అవసరాలు - అధికార దాహమే వారిని పార్టీ మారేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు అందరి దృష్టి 2019 ఎన్నికల మీదే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. దానికోసం ఏమైనా చేయాలి.. అదే సమయంలో ప్రజల నాడి తెలుసుకొని గెలిచే పార్టీలో చేరిపోవాలని నాయకులందరూ సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్ హవా నడుస్తోంది. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఫుల్ హిట్ అయ్యి రెండోసారి ఆ పార్టీకే అధికారం దక్కబోతోందని మెజార్టీ సర్వేల్లో తేలింది. దీంతో ఇప్పటికే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలకూ మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడం కష్టంగా మారింది. అందుకే నమ్ముకున్న పార్టీని నట్టేటా ముంచేసి తమ దారి తాము చూసుకుంటున్నారు.
తాజాగా వీర కాంగ్రెస్ వాది దానం నాగేందర్ ఆశ్చర్యకరంగా టీఆర్ ఎస్ లో చేరి కాంగ్రెస్ కు షాకిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కనీసం నినాదాలు కూడా చేయని ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు కేసీఆర్ ను ఎన్నోసార్లు తిట్టాడు. కానీ ఇప్పుడు తత్త్వం భోదపడి టీఆర్ ఎస్ పంచన చేరాడు. వచ్చేసారి టీఆర్ ఎస్ గెలుపు ఖాయమని క్షేత్రస్థాయిలో పసిగట్టిన దానం సంవత్సరం ముందే కారు ఎక్కేసి సుదులాయించుకున్నారు.
ఇక దానం బాటలోనే మరో సీనియర్ కారు ఎక్కేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ లో సీనియర్ నేత.. 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా.. 7 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ముఖేష్ గౌడ్ గోషామహల్ నియోజకవర్గంలో తనకంటూ మాస్ ఇమేజ్ తో ప్రజలకు చేరువయ్యారు. తాజాగా ఆయన కొడుకు విక్రమ్ గౌడ్ తో కలిసి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. క్యాడర్ ను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరడంతో ఈయన కూడా తాజాగా నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. గెలిచే పార్టీలో ఉంటేనే నియోజకవర్గం అభివృద్ధి నిధులు - విధులు - పదవులు వస్తాయని గ్రహించి టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఇలా ఒక్కొక్క సీనియర్ నేత కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతుండడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఆశనిపాతమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు వస్తున్న ఈ షాక్ లు ఆ పార్టీని కోలుకోకుండా చేస్తున్నాయి.