Begin typing your search above and press return to search.

టీడీపీలోకి తుమ్మల.? తాజా వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కు గుడ్ బైయేనా?

By:  Tupaki Desk   |   30 Nov 2022 1:30 PM GMT
టీడీపీలోకి తుమ్మల.? తాజా వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కు గుడ్ బైయేనా?
X
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఓడిపోవడంతో టీఆర్‌ఎస్ పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఖమ్మం టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు ఎప్పట్నుంచో టీఆర్ఎస్ ను ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఓడిపోయినా సరే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారు..

ఇక ఈ మధ్య కాలంలో తుమ్మల ఖమ్మంలో మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారని, ఏం చేసినా తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే ఉంటానని కొద్దిరోజుల క్రితమే తేల్చి చెప్పారు. అయితే మంగళవారం ఒక ఆసక్తికరమైన ఎపిసోడ్ జరిగింది. తుమ్మల తన 40 ఏళ్ల రాజకీయ జీవితానికి ఎన్టీఆర్ గాడ్ ఫాదర్ అని కితాబిచ్చాడు. కేసీఆర్ ను తలుచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన చర్యలు, వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీని మరింతగా కలవరపెడుతున్నాయి.

తాజాగా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కొత్తూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. “నేను ఎప్పుడూ పేద ప్రజలకు సేవ చేయాలని.. వారి జీవితాలను ఉన్నతీకరించాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌కి కృతజ్ఞతలు’’ అని తుమ్మల అనడం హాట్ టాపిక్ గా మారింది.. ఆయన పోటీ చేయాలనుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా ఉత్కంఠకు తెరపడింది. మీరు మద్దతిస్తే ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తుమ్మల ప్రకటించారు. ఈ సమావేశంలోనే తుమ్మల తన వాదనను ప్రకటించగానే కొందరు వ్యక్తులు, ఆయన అనుచరులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నినాదాలు చేశారు.

తుమ్మల వ్యాఖ్యలు ఖమ్మం టీఆర్‌ఎస్‌లో చర్చకు దారితీశాయి. 2018లో ఇదే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ టికెట్‌ ఆశించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చే యోచనలో ఉండడంతో తుమ్మలకు ఈసారి పాలేరు నుంచి టీఆర్‌ఎస్ బీ-ఫారం వచ్చే అవకాశాలు తక్కువ.

తుమ్మల ఈ మీటింగ్ తో టీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరుతారా? మరోసారి చంద్రబాబు పార్టీ నుంచి పోటీచేస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఆయన వ్యాఖ్యలు అవే సూచిస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం అనుమానంగా ఉంది. టీఆర్ఎస్ కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మళ్లీ తెలుగుదేశంలోకి వస్తారని వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.