Begin typing your search above and press return to search.

మ‌మ్మ‌ల్ని త‌మిళ‌నాడులో క‌ల‌పండి..టీడీపీ నేత సంచ‌ల‌న డిమాండ్‌

By:  Tupaki Desk   |   4 Jan 2020 7:52 AM GMT
మ‌మ్మ‌ల్ని త‌మిళ‌నాడులో క‌ల‌పండి..టీడీపీ నేత సంచ‌ల‌న డిమాండ్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు అంశం ప‌లు ప్రాంతాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హ‌ర్షాతిరేకాల‌కు కార‌ణం అవుతోంది. ప్ర‌ధానంగా, రాజధాని తరలింపు ప్రతిపాదన పై రాజధాని గ్రామాలు భగ్గుమంటున్నాయి. రాజధాని గ్రామాలు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వెలగపూడిలో 17వ రోజు కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా సీమ‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ చిత్తూరు జిల్లాను త‌మిళ‌నాడులో క‌ల‌పాల‌ని కోరారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి మార్పు, విశాఖ‌ లో ఏర్పాటు నిర్ణ‌యం స‌రైంద‌ని కాద‌ని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి...కానీ పాలనా వికేంద్రీకరణ కాదన్నారు. ఒక‌వేళ మార్చాలి అనుకుంటే, అన్ని సౌకర్యాలున్న తిరుపతిని రాజధాని చేయండని అమర్‌నాథ్ రెడ్డి కోరారు. లేదంటే, త‌మ చిత్తూరు జిల్లాను త‌మిళ‌నాడులో లేదా క‌ర్ణాట‌క‌లో క‌ల‌పాల‌ని డిమాండ్ చేశారు.


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ కు పాలన చేతకాక కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌‌కు పాలన వికేంద్రీకరణపై ఆలోచన, చిత్తశుద్ధి ఉంటే.. 2014లోనే ఈ ప్రతిపాదన చేయాల్సిందన్నారు. జగన్ 2014లో నిద్రపోయి ఇప్పుడు లేచారా? అని ఎద్దేవా చేశారు. పాలన వికేంద్రీకరణ అంటే ముగ్గురు సీఎంలను పెట్టండని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అమరావతికి భూములిచ్చిన రైతులను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారని ఆరోపించారు.