Begin typing your search above and press return to search.

నాకు టికెట్ ఇవ్వ‌కుంటే కాంగ్రెస్‌ లో బాగోతం బ‌య‌ట‌పెడ‌తా!

By:  Tupaki Desk   |   16 Nov 2018 4:33 AM GMT
నాకు టికెట్ ఇవ్వ‌కుంటే కాంగ్రెస్‌ లో బాగోతం బ‌య‌ట‌పెడ‌తా!
X
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌ దాస్ హైదరాబాద్‌ లో కొందరు కాంగ్రెస్ నాయకులతో చీకటి వ్యాపారం చేస్తూ టికెట్ల బేరసారాలను నడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత క్యామ మ‌ల్లేశ్‌ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. టికెట్ ఖరారు చేయాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్‌ దాస్ కుమారుడు సాగర్ తన కుమారుడిని డిమాండ్ చేశారని చెప్తూ.. దానికి సంబంధించిన ఆడియో టేప్‌ ను విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భిక్షపతియాదవ్ - జంగయ్యయాదవ్ - ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ - యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్‌ లో దొంగల ముఠా తయారైందని విమర్శించారు. అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రో నాయ‌కుడు సంచ‌ల‌న విమ‌ర్శలు చేశారు.

చొప్పదండి నుంచి రెబెల్‌ గా పోటీచేస్తానని మాజీమంత్రి సుద్దాల దేవయ్య ప్రకటించారు. ఆయన కరీంనగర్‌ లో మాల - మాదిగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో చొప్పదండి టికెట్ అశించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం కూడా పాల్గొన్నారు. మేడిపల్లి సత్యంకు ఇచ్చిన టికెట్‌ ను ఈ నెల 19లోగా రద్దుచేసి దేవయ్యకు ఇవ్వాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టికెట్ రాకుండా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కుట్రలు పన్నారని - తమకు అన్యాయం జరిగితే టికెట్ల పంపిణీ వెనుక బాగోతాన్ని బయటపెడుతామని దేవయ్య హెచ్చరించారు.

మహాకూటమిలో రోజు రోజుకూ చిచ్చు ముదురుతూనే ఉన్నది. నామినేషన్ల ప్రక్రియ మొదలై నాలుగు రోజులైనా కూటమిలో కుంపటి ఆరడం లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ - టీడీపీ.. కాంగ్రెస్ - టీజేఎస్ మధ్య పొత్తుల కత్తులు దూసుకుంటునే ఉన్నారు. పొత్తు గిత్తు జాన్తానై.. బరిలో తాముంటామంటే తాముంటామంటూ ఆశావహులు రెబల్స్‌గా బరిలో దిగుతున్నారు. మరికొందరు రాజీనామాబాట పడుతున్నారు. పార్టీ అభ్యర్థి ఓటమే లక్ష్యమంటూ ప్రకటనలు చేస్తున్నారు.