Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి

By:  Tupaki Desk   |   17 April 2023 1:15 AM GMT
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి
X
అయ్యో అనిపించే విషాదం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. బీజేపీ నేత పాటిల్ నీరజా రెడ్డి తాజాగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

కర్నూలు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆమె బాచుపల్లి వద్ద కారు టైరు పేలి.. బోల్తా కొట్టటంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే ఆమెను కర్నూలు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి.. గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన హత్యకు గురయ్యారు. నీరజారెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పుడామె అమెరికాలో ఉంటున్నారు. 2009 - 2014 మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన ఆమె.. అంతకు ముందు పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆమె ఆలూరుకు షిప్టు అయ్యారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ప్రజారాజ్యం అభ్యర్థిపై 5 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె వైసీపీలోకి మారారు.

అక్కడ ఉండలేక ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్యంగా ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నీరజారెడ్డి దుర్మరణం గురించి విన్నంతనే ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి విషాదం గుర్తుకు రాక మానదు.

మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆమె.. 2014 ఎన్నికల వేళలో.. రాత్రి వేళ ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. నంద్యాల పార్లమెంటు పరిధికి చెందిన ఈ మహిళా నేతలు ఇద్దరు ఒకే తరహాలో కారులో ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై మరణించటం గమనార్హం.