Begin typing your search above and press return to search.

వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి

By:  Tupaki Desk   |   7 May 2020 4:30 AM GMT
వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి
X
వార్డు మెంబర్ అయితే చాలు జీవితం సెట్ అయినట్లే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. సర్పంచ్ అయితే కోట్లకు పడగలెత్తేసే బ్యాచు ఉంది.అలాంటి ఎమ్మెల్యే అయితే? ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదనుకుంటాం. అందరూ అలా ఉండరు. కొందరు విలువలు.. సిద్ధాంతాల్ని నమ్ముకొని బతికేటోళ్లు చాలామందే ఉంటారు. కాకుంటే.. అలాంటి వారి విషయాలు పెద్దగా బయటకు రావు.

విన్నంతనే అయ్యో అనిపించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు.. చేతిలో చిల్లిగవ్వ లేక వైద్యం చేయించుకోలేని కారణంగా మరణించిన దారుణం తెలంగాణలో చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ మరణం పలువురిని కలిచి వేస్తోంది. ఆదర్శవంతంగా బతకటమే వారు చేసిన తప్పా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్నెల్ల నర్సయ్య స్వాతంత్ర సమరయోధుడు. 1957-62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. రాజకీయమంటే ప్రజాసేవే తప్పించి ఆస్తులు పోగేసే మార్గం కాదని బలంగా నమ్మే ఆయన.. తన కుటుంబానికి పేదరికాన్ని ఇచ్చి వెళ్లిపోయారు. పదిహేనేళ్ల క్రితం ఆయన మరణించగా.. ఆయన కుటుంబం అప్పటి నుంచి చిన్న రేకుల షెడ్డులో బతుకు వెళ్ల దీస్తోంది. నర్సయ్య కుమారుడు ఆనందం ఊళ్లో సుతారిగా పని చేస్తుంటాడు.

కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన అతడికి ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పటంతో రూ.3లక్షలు అప్పు చేసి మరీ చేయించుకున్నాడు. అయినా కుదుట పడలేదు. వైద్యానికి మరో రూ.లక్ష అవసరం కావటం.. చేతిలో డబ్బుల్లేకపోవటంతో అనారోగ్యంతో ఇంట్లోనే కన్నుమూశారు. ఆయనకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. విలువల కోసం బతికిన వారి బతుకులు ఇలా ఉండటమా? మరీ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.