Begin typing your search above and press return to search.

ఆఖర్లో.. జగన్ కే మద్దతు పలికిన 'శత్రువు'!

By:  Tupaki Desk   |   14 April 2019 10:25 AM GMT
ఆఖర్లో.. జగన్ కే మద్దతు పలికిన శత్రువు!
X
ఒక దశలో జగన్ ను తిట్టించడానికి తెలుగుదేశం అనుకూల మీడియా వీర శివారెడ్డిని తెగ యూజ్ చేసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్ మీద తీవ్రాతి తీవ్రంగా ధ్వజమెత్తిన వారిలో వీర శివారెడ్డి ఒకరు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వీర శివారెడ్డి తెలుగుదేశం తరఫునా నెగ్గారు, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున నెగ్గారు.

ఎందుకో కానీ.. కిరణ్ హయాంలో జగన్ మీద వీర శివారెడ్డి శివాలెత్తిపోయే వారు. అనంతరం రాజకీయంగా కొంత ఉనికిని కోల్పోయారు. అంటే కమలాపురం నుంచి మళ్లీ టికెట్ సంపాదించుకోలేకపోయారు. టీడీపీలో చేరినా.. రెండు పర్యాయాలూ టికెట్ దక్కలేదు.

అయితే గత ఐదేళ్లలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీరశివారెడ్డి తరచూ జగన్ మీద కస్సుమనే వారు. అదంతా ఆఖరి నిమిషంలో మరిచిపోయారీయన. తీరా పోలింగ్ రోజున జగన్ కు జై కొట్టారు ఈయన.

కమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పుత్తా నరసింహారెడ్డి పోటీ చేశారు. మొదట్లో తన మద్దతు ఆయనకే అని వీర శివారెడ్డి ప్రకటించారు. గట్టిగా ప్రచారం కూడా చేశారు. అయితే ఏమైందో కానీ.. పోలింగ్ రోజున

తన మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అని వీర శివారెడ్డి ప్రకటించారు. తన అనుచరులు అంతా తెలుగుదేశానికి కాకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వీర శివారెడ్డి వారిని ఆదేశించారు.

వీర శివారెడ్డి ప్రభావం మరీ ఎక్కువగా లేకపోయినా.. ఎంతోకొంత ఉంటుందని మాత్రం స్థానికులు అంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి వీర శివారెడ్డి బంధువే అని, అవినాష్ రెడ్డి తల్లి తరఫు నుంచి వీరశివారెడ్డితో చుట్టరికం ఉందని.. అందుకే ఆయన అటు వైపు మొగ్గు చూపారని అంటున్నారు. పాత బంధుత్వం ఇలా ఇప్పుడు వీర శివారెడ్డి పార్టీ మారేలా చేసిందనే మాట వినిపిస్తోంది.