Begin typing your search above and press return to search.

అరే.. కాశ్మీర్ లో కుదిరేది.. తెలుగు రాష్ట్రాల్లో కుదరదా?

By:  Tupaki Desk   |   29 Feb 2020 9:30 AM GMT
అరే.. కాశ్మీర్ లో కుదిరేది.. తెలుగు రాష్ట్రాల్లో కుదరదా?
X
అవసరం ఎలాంటివాడినైనా మార్చేస్తుందనటానికి సీనియర్ టీఆర్ఎస్ నేత మాటలే సాక్ష్యంగా చెప్పాలి. మొన్నటి వరకూ ఏపీతో పోలుస్తూ.. తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని అదే పనిగా ఏకరువు పెట్టే తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఇప్పుడో ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ తో పాటు.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని కశ్మీర్ రాష్ట్రంతో పోల్చి చెబుతున్న తీరు ఆసక్తికరంగా మారింది.

అన్ని రాష్ట్రాలకు ఒకే విధానాన్ని అనుసరించకుండా కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తూ.. మరికొన్ని రాష్ట్రాల విషయంలో వేరుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు ద్వంద వైఖరిని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమకు అనుకూలం లేని రాష్ట్రాల విషయంలో మోడీ మాష్టారు వివక్ష ప్రదర్శిస్తున్నారని వినోద్ ఆరోపిస్తున్నారు. ఉన్నట్లుండి కేంద్రం మీద ఎందుకింత కస్సుమంటున్నారంటే దానికి కారణం కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే.

కశ్మీర్ లో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్ని పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల్ని ఎందుకు పెంచరని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏడు స్థానాలు పెంచుతూ కశ్మీర్ కు న్యాయం చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచకుండా అన్యాయం చేయటం ఎంతమేర సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు.

ఒక దేశం - ఒకే చట్టం అనే నినాదం ఇప్పుడేమైందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఆరేళ్లుగా అసెంబ్లీ స్థానాల్ని పెంచాలని ఇరు రాష్ట్రాలు కోరుతున్నా.. ఇప్పటి వరకూ పట్టించుకోవటం లేదన్న వినోద్.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కి ఎలాంటి లాభం ఉండదన్న కారణంతోనే అసెంబ్లీ సీట్ల పెంపు గురించి పట్టించుకోవటం లేదని తప్పు పట్టారు. కశ్మీర్ కు సీట్ల సంఖ్య పెంపునకు తాము వ్యతిరేకం కాదని.. అదే సమయం లో తెలుగు రాష్ట్రాలకు పెంచితే సరి పోతుందని స్పష్టం చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ఆలోచన కేంద్రానికి లేదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యం లో వినోద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి.. ఆయన చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి స్పందించే సాహసం చేస్తారా?