Begin typing your search above and press return to search.

'నంది' అవార్డులు ప‌ట్టించుకోరా?

By:  Tupaki Desk   |   3 Sep 2019 3:15 PM GMT
నంది అవార్డులు ప‌ట్టించుకోరా?
X
కాలంతో పాటే మార్పు. అవార్డు అంటే ఒక‌ప్పుడు గౌర‌వం ఉండేది. ఇప్పుడు ప్ర‌తి కార్పొరెట్ కంపెనీ అవార్డులు పెట్టుకుని న‌చ్చిన వాళ్ల‌ను పిలుచుకుని అవార్డులు ఇచ్చేస్తున్నాయి. దీంతో అవార్డు విలువ ప‌లుచ‌న అయిపోయింది. అయితే దీని ప్ర‌భావం అత్యంత కీల‌క‌మైన `నంది` పుర‌స్కారాల‌పైనా ప‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం క‌ళాకారుల్లో అవార్డుల ఉత్సాహం పూర్తిగా లోపించింది. ఏపీలో నంది అవార్డులు ఇవ్వ‌క‌పోవ‌డంపై సీనియర్ నటుడు కం రాజకీయ నాయ‌కుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. నేడు క‌ళాబంధు టీఎస్సార్ స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు.

ఒకప్పుడు అవార్డులు అంటే పండ‌గ‌లా ఉండేది. ఇప్పుడా అవార్డుల గురించి మాట్లాడేవాళ్లే లేర‌ని ముర‌ళీమోహ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కానీ.. ప్రస్తుత ప్రభుత్వం కానీ నంది అవార్డులను విస్మరించాయని అన్నారు. నంది అవార్డులు ఎంతో ప్రతిష్ఠాత్మకమైవి. ప్రభుత్వం ఇచ్చే పుర‌స్కారాల్ని గొప్ప‌గా భావిస్తారు. న‌టీన‌టులు వాటిని స్వీక‌రించ‌డాన్ని గౌర‌వంగా భావిస్తార‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు. ప్ర‌భుత్వాలు కొంత‌కాలంగా నంది పుర‌స్కారాల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కొన్నేళ్లుగా ఇవ్వాల్సిన నందుల్ని వెంట‌నే ఇవ్వాల‌ని ముర‌ళీమోహ‌న్ ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌తం గ‌తః. ఇప్ప‌టి ప్ర‌భుత్వాలు అయినా స్పందించి అవార్డుల్ని ఇవ్వాల‌ని ముర‌ళీమోహ‌న్ ఆకాంక్షించారు. ప్ర‌భుత్వ పుర‌స్కారాలు అందించ‌డంలో ఏపీ-తెలంగాణ ప్ర‌భుత్వాలు దొందూ దొందేన‌న్న విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. తెలంగాణ‌లో `నంది` స్థానంలో `సింహా` అనే పేరుతో ప్ర‌భుత్వ‌ అవార్డులు ఇస్తార‌ని ప్ర‌క‌టించారు. కానీ వాటి జాడ అయితే క‌నిపించ‌డం లేదు. తాజాగా సీనియ‌ర్ న‌టుడి ఆవేద‌న చూసి అయినా క‌ళారంగంపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారిస్తారేమో చూడాలి.