Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను నమ్మొదు: జగన్ కు తెలంగాణ మాజీ ఎంపీ సలహాలు

By:  Tupaki Desk   |   2 March 2020 1:20 PM GMT
కేసీఆర్ ను నమ్మొదు: జగన్ కు తెలంగాణ మాజీ ఎంపీ సలహాలు
X
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగన్ కు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల సమయంలోనే అక్కడ జగన్, ఇక్కడ నేను గెలుస్తానని పేర్కొన్నాడు కేసీఆర్. ఆ తర్వాత పలుసార్లు జగన్, కేసీఆర్ బంధం కొనసాగింది. అయితే ఇటీవల ఎన్నికల అనంతరం వారిద్దరి మధ్య సత్సంబంధాలు మెరుగయ్యాయి. ఏకంగా జగన్ సీఎం కేసీఆర్ ను గురువుగా భావిస్తున్నారు. తరచూ కేసీఆర్ తో జగన్ సమావేశమై.. సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ ఒకరు కేసీఆర్ ను నమ్మితే నట్టేటా మునుగుతావని, కేసీఆర్ వాడుకుని వదిలేసే రకమని జగన్ కు సూచనలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసింది.. మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ నాయకుడు వివేక్.

తన తండ్రి కాక జయంతి నాడే తన మనవడు వీర్ వెంకటస్వామి పుట్టాడని, ఆ బాలుడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించుకునేందుకు సోమవారం తిరుమలకు వచ్చారు. కుటుంబసభ్యులతో దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ మైత్రిపై ఘాటుగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహసంబంధాలేమీ లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సీఎం కేసీఆర్, జగన్ మధ్య మంచి స్నేహం ఉందని భావిస్తున్నారని, కానీ అంత లేదని పేర్కొన్నారు. కేసీఆర్ కు ఎప్పుడూ శాశ్వత మిత్రులు ఉండరని చెప్పారు.

కేసీఆర్, జగన్ మిత్రులని అందరూ అనుకుంటున్నారని పేర్కొన్న వివేక్ సీఎం కేసీఆర్ కు ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరని, తన అవసరాన్ని బట్టి కేసీఆర్ ప్రవర్తిస్తారని తెలిపారు. కేసీఆర్ అందరినీ తన అవసరానికి వాడుకొని వదిలేస్తాడని, అలాంటి రకం అని గుర్తించే తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేసీఆర్ గురించి సీఎం జగన్ కు బాగా తెలియదని, ఈ విషయాన్ని జగన్ తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ జగన్ తో ఎందుకు మిత్రుడుగా నటిస్తారో కూడా వివేక్ తెలిపారు. కేవలం సాగునీటి ప్రాజెక్టులు,, లింక్ ప్రాజెక్ట్స్ పేరుతో కమీషన్ల కోసమే జగన్‌తో కేసీఆర్ మైత్రిగా కొనసాగిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా జగన్ మేల్కొవాలని పరోక్షంగా సూచించారు.

వివేక్ గతంలో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పని చేశారు. ఆ సమయం లోనే టీఆర్ఎస్ లో చేరగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. అయితే ఎన్నికల సమయం లో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోగా.. తనను అవమానించారంటూ వివేక్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం కొన్నాళ్లకు బీజేపీ లో చేరి ప్రస్తుతం కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. మరి వివేక్ విమర్శలపై టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో...