Begin typing your search above and press return to search.

పేరుకు 95 ప‌డినా.. చివ‌ర‌కు మిగిలింది వారిద్ద‌రే

By:  Tupaki Desk   |   30 Jun 2017 4:52 AM GMT
పేరుకు 95 ప‌డినా.. చివ‌ర‌కు మిగిలింది వారిద్ద‌రే
X
దేశంలో అత్యున్న‌త స్థాన‌మైన రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల విష‌యంలో అధికార‌.. విపక్షాలు రెండుగా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. మోడీ మేజిక్ పుణ్య‌మా అని విప‌క్షాల్లో అనైక్య‌త‌ను పెంచ‌టంలో ఆయ‌న స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. కొంద‌రు విప‌క్ష నేత‌ల్ని త‌న‌వైపున‌కు తిప్పుకునేలా చేసి.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో తాము బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థికి ఓటు వేసేలా మ‌ద్ద‌తు సాధించ‌టం క‌నిపిస్తోంది.

బీజేపీ అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన రామ్ నాథ్ కోవింద్ కు ఎన్డీయే ప‌క్షంతో పాటు.. విప‌క్ష పార్టీల‌తో పాటు త‌ట‌స్తులు కూడా మ‌ద్ద‌తు తెలిపాయి. గెలిచేందుకు అవ‌స‌ర‌మైన మెజార్టీ లేన‌ప్ప‌టికీ.. పోటీ చేయాల‌న్న త‌లంపుతో కాంగ్రెస్ త‌న రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా మీరా కుమార్‌ ను బ‌రిలోకి దించారు. ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీలు సైతం కాంగ్రెస్ అభ్య‌ర్థికి త‌మ మ‌ద్ద‌తును తెలిపాయి.

ఇదిలా ఉండ‌గా.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసిన వాటిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ప‌రిశీలించింది. గ‌డువు ముగిసేస‌రికి మొత్తం 95 మంది రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే.. నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగా నామినేష‌న్లు జారీ చేసిన వారు.. రెండు ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు త‌ప్పించి మిగిలిన వారు ఎవ‌రూ రూల్స్‌కు త‌గ్గ‌ట్లుగా నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌లేదు.

దీంతో.. 95 నామినేష‌న్ల‌లో రెండు మిన‌హా మిగిలిన నామినేష‌న్ల‌ను తిరస్క‌రిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో.. రాష్ట్రప‌తి తుది పోటీలు ఇద్ద‌రు మిన‌హా మిగిలిన వారి నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించారు. ప్ర‌ధాన అభ్య‌ర్థులు మిన‌హా మిగిలిన వారికి ప్ర‌తిపాదించే ఎల‌క్టోర‌ల్ కాలేజి స‌భ్యులుకానీ.. మ‌ద్ద‌తు తెలిసే స‌భ్యుల సంఖ్యా బ‌లం స‌రిగా లేనందున నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించిన‌ట్లుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. సో.. అంతిమంగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కోవింద్‌.. మీరాకుమార్ లు మాత్ర‌మే మిగిలారు. నిజానికి వీరిద్ద‌రి మ‌ధ్య పోరు సైతం నామ‌మాత్ర‌మే. ఎందుకంటే.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టానికి అవ‌స‌ర‌మైన బ‌లం బీజేపీ అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్‌ కు ఉన్న విష‌యం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/