Begin typing your search above and press return to search.

కొత్త కోణం: ఉన్న ఓట్ల కంటే పోలైన ఓట్లే ఎక్కువ‌ట‌

By:  Tupaki Desk   |   18 April 2019 11:18 AM GMT
కొత్త కోణం: ఉన్న ఓట్ల కంటే పోలైన ఓట్లే ఎక్కువ‌ట‌
X
ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల సిత్రాలు ఒక్కొక్క‌టిగా తెర మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా అలాంటిదే ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి.. ముక్కున వేలేసుక‌నేలా మారింది. త‌వ్వి చూస్తే.. ఇలాంటివి మ‌రెన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయో? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో.. అక్క‌డ ఉన్న ఓట్ల కంటే పోలైన ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌టం విశేషం.

నియోజ‌క‌వ‌ర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లుగా చెబుతున్నారు. సంత‌మాగులూరు మండ‌లం 48వ పోలింగ్ కేంద్రంలో 299 మ‌హిలా ఓట‌ర్లు ఉండ‌గా.. 350 ఓట్లు పోలైన‌ట్లు చూపించ‌టం విశేషం. అద్దంకి ప‌ట్ట‌ణంలోని 154వ పోలింగ్ కేంద్రంలో 435 మంది ప‌రుష ఓట‌ర్లు ఉండ‌గా.. 500 ఓట్లు పోలైన‌ట్లు చూపించారు.

మొత్తం పోలింగ్ ను 89.87 చూపించినా.. లోతుల్లోకి వెళ్లి చూస్తే.. ఈ కొత్త సిత్రాలు వెలుగు చూశాయి. తాజాగా విడుద‌ల చేసిన పోలింగ్ వివ‌రాల్లో ఐదు కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ అంశాన్ని స‌రి చేయ‌టం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎందుకిలా జ‌రిగిందంటే.. అధికారుల నుంచి వ‌స్తున్న స‌మాధానం వింటే మ‌తిపోవాల్సిందే. ఎన్నిక‌ల రోజున హ‌డావుడిగా ఉండ‌టంతో కంప్యూట‌ర్లో త‌ప్పుగా న‌మోదైంద‌ని చెప్ప‌టం విశేషం. ఎంట్రీలో మాత్ర‌మే పొర‌పాటు జ‌రిగింద‌ని.. దాన్ని స‌రి చేసి పంపుతామ‌ని చెబుతున్నారు. ఎంత హ‌డావుడి ఉంటే మాత్రం.. మొత్తం ఓట్లు ఎన్ని? పోలైన ఓట్లు ఎన్ని? లాంటి అంశాల్ని స‌రి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది క‌దా? అది కూడా చేయ‌కుండా చెబుతున్న ఆన్స‌ర్లు చూస్తే.. అస‌లు పోలింగ్ జ‌రిగిన తీరుపై కొత్త సందేహాలు వ్య‌క్తం కావ‌టం ఖాయం.