Begin typing your search above and press return to search.

రెండో లిస్టు అంత వీజీయేం కాదు!

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:11 AM GMT
రెండో లిస్టు అంత వీజీయేం కాదు!
X
12 వ వ్యక్తి విచారణ కూడా పూర్తయిపోయిన తర్వాత.. డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీల విచారణ పర్వం సృష్టించిన ప్రకంపనాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పైగా చివరగా విచారణకు వచ్చిన నందూను ప్రశ్నించడం కేవలం మూడు గంటల్లోనే ముగిసిపోయింది కూడా! ఈ డజను మంది సెలబ్రిటీలను విచారించడం ద్వారా సిట్ అధికారులు అనేక కీలకమైన వివరాలను సేకరించారని, ఇంకా అనేకమంది ప్రముఖుల వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చాయని వారికందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారని.. త్వరలోనే సెకండ్ ఎపిసోడ్ మొదలవుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. రెండో జాబితా రావడం అంత సులువేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు.

మొదటి విడతలో కొందరు సెలబ్రిటీలను విచారణకు పిలిచిన సందర్భంలోనే ఈ ప్రక్రియకు మీడియాలో వచ్చిన అనూహ్యమైన ప్రచారం విచారణాధికారులను కూడా కొంత ఇబ్బందికి గురిచేసింది. వారు తమ పని తాము చేసుకుపోతున్నప్పటికీ.. అనుకోకుండా వచ్చిన ప్రచారంతో వారు సంకటంలో పడ్డారు. అక్కడికేదో తాము పనిగట్టుకుని సెలబ్రిటీల మీద బురద చల్లుతున్నట్లుగా కొందరు ఆరోపణలు చేయడం కూడా వారికి ఇబ్బంది కలిగించింది. ఈ నేపథ్యంలో ఇక మీదట ఎవరిని విచారించినా కూడా కాస్త గోప్యత పాటించాలని అధికారులు నిర్ణయించారు. మరొకవైపు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న ప్రముఖులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇన్ని రకాల పుకార్లు చెలామణీలో ఉన్న నేపథ్యంలో అసలు డ్రగ్స్ కేసు విచారణ వ్యవహారం క్రమంగా మరుగున పడుతుందేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది.

నిజానికి అధికార్లు డ్రగ్స్ ను నియంత్రించాలనే ఉద్దేశంతో ఉండేట్లయితే సరఫరాదారుల్ని కట్టడిచేస్తే సరిపోతుంది. వాడే వారి విచారణ నామమాత్రంగా జరిగినా సరిపోతుంది. ఇప్పటికే సుదీర్ఘంగా సాగిన విచారణ పర్వంలో డ్రగ్స్ రాకెట్ లతో పెడ్లర్ లుగా ప్రమేయం ఉన్న పలువురి వివరాలు పోలీసులకు తెలిసినట్లే సమాచారం అందుతోంది. ఆ వర్గాలను కట్టడి చేసి, ఒక్క కెల్విన్ చెప్పిన వివరాల ఆధారంగా ప్రతి ఒక్కరినీ విచారిస్తూ పోయే పర్వానికి తెరదించాలనే యోచన కూడా వారు చేయవచ్చు. ఎందుకంటే... మరో పెడ్లర్ ను అరెస్టు చేసిన వ్యవహారంలో దాదాపు 1500 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేర్లు బయటకువచ్చాయి. వీరందరినీ విచారిస్తూ పోతే బ్రాండ్ హైదరాబాద్ పరువు పోతుందని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఇక విచారణ పర్వంలో గోప్యత పాటించాలని అధికారులు అనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని కోణాల నేపథ్యంలో.. అసలు రెండో లిస్టు తయారు కావడం, ఇదే స్థాయిలో మరోసారి మరికొందరు సెలబ్రిటీల విచారణ అంత ఈజీ కాదని అంతా అనుకుంటున్నారు.