Begin typing your search above and press return to search.

సిట్‌..ఇప్ప‌టికీ ఓకే కానీ తర్వాత ఏంటి?

By:  Tupaki Desk   |   2 Aug 2017 5:33 AM GMT
సిట్‌..ఇప్ప‌టికీ ఓకే కానీ తర్వాత ఏంటి?
X
టాలీవుడ్‌ లో సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ మాఫియా విష‌యంలో నెక్ట్స్ ఏంటి? అనే చ‌ర్చ అన్ని వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. టాలీవుడ్‌ ను కుదిపేసిన డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటి వరకు 12మంది సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. మాదకద్రవ్యాల కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగిసింది. రోజుకొకరి చొప్పున సిట్ అధికారులు 12 మందిని విచారించారు. ఈ కేసులో సిట్ అధికారులు చేపట్టే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపై నోటీసులు ఇచ్చే వారందరిని గోప్యంగా విచారించాలన్న యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే గోప్యంగా విచారించనున్నట్టైతే..నోటీసులు కూడా ర‌హ‌స్యంగానే పంపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు విచారించిన వారి వాంగ్మూలాన్ని చార్జీషీట్‌ లో ఉంచాలని అధికారులు మీడియాకు తెలిపారు. అయితే విచారణకు వచ్చిన వారిలో కొందరిని సాక్షిగానే విచారించామని సిట్ అధికారులు పేర్కొనడంతో..విచారణకు వచ్చిన వారంతా నిందితులా? సాక్షులా? అనే సంశయంలో సినీ ప్రముఖులు ఉన్నారు. కొందరిని సాక్షులుగానే సిట్ పేర్కొనడంతో సినీ ప్రముఖుల్లో ఉత్కంఠ రేపుతోంది. సాక్షులుగానే విచారణ ఎదుర్కొన్నది ఎవరెవరన్నది చర్చ జరుగుతోంది.

కాగా, చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం నటుడు నందు అలియాస్ ఆనంద కృష్ణను విచారించారు. కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం - మాదకద్రవ్యాల సరఫరా - ఎవరెవరికి అలవాటు - పంపిణీ విధానం వంటి వాటిని సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ తమ ఇంటా-ఒంట్లో లేదని నందు సిట్‌ కు స్పష్టం చేశారు. డ్రగ్స్ వాసనే తెలియదు..కానీ పబ్‌ లకు మాత్రం వెళ్తానని సిట్ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. కెల్విన్ - జీషాన్ అలీ ఎవరో తెలియదని చెప్పినట్టు సమాచారం. మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు త‌దుప‌రి అడుగు ఏమిట‌నే విష‌యంలో మాత్రం ఇంకా అస్ప‌ష్ట‌తే ఉంద‌ని అంటున్నారు.