Begin typing your search above and press return to search.

విగ్రహాల తొలగింపులో వైఎస్ విగ్రహాలకు మినహాయింపా?

By:  Tupaki Desk   |   7 April 2022 4:37 AM GMT
విగ్రహాల తొలగింపులో వైఎస్ విగ్రహాలకు మినహాయింపా?
X
ఏపీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రోడ్లు.. ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల్ని ఏర్పాటు చేయటం.. ఇప్పటికే ఏర్పాటు చేసిన వాటిని తొలగించే విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై చూపుతున్న వివక్ష పై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. క్రిష్ణా జిల్లా నందిగామ పట్టణంలో ఏర్పాటు చేసిన జాతీయ నేతల విగ్రహాల్ని తొలగించిన అధికారులు.. అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రం వదిలేసిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

విగ్రహాల తొలగింపులో వివక్షను సహించలేమని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని.. తాము జోక్యం చేసుకునే పరిస్థితిని తీసుకురావొద్దంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విగ్రహాల తొలగింపు ప్రక్రియలోని సున్నితత్వాన్ని తాము అర్థం చేసుకున్నామని.. అందుకే ప్రభుత్వమే ఒక సొల్యూషన్ ను చూపించాలని సూచన చేసింది.

నందిగామ పట్టణంలో తొలగించిన విగ్రహాలను ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నరాని.. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని పిటిషనర్ కోర్టు ద్రష్టికి తీసుకురాగా.. దీనిపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న రహదారి మార్జిన్ లో ఉన్న వైఎస్ విగ్రహాన్ని తరలించకుండా.. దానిని తొలగించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో రోడ్డు విస్తరణ పనులను కూడా నిలిపివేసిన వైనాన్ని హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.

విగ్రహాల తరలింపు విషయంలో వివక్ష చూపిస్తున్నారన్న వాదనకు ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాదిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విగ్రహాలను వేరే ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. వైఎస్ విగ్రహం రెవెన్యూ స్థలంలో ఉందన్నారు.

ఆ విగ్రహం వాహన రాకపోకలకు అడ్డంగా ఉందన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పిటిషనర్ స్థానిక టీడీపీ నేత అని.. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసు వేసినట్లుగా వాదించారు. దీంతో.. ఇరుపక్షాల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. రాజకీయ అంశాలతో తమకు సంబంధం లేదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో రోడ్లపై రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు సరికాదని స్పష్టం చేసింది. మరేం జరుగుతుందో చూడాలి.