Begin typing your search above and press return to search.

చిన‌బాబు ఓట‌మి త‌థ్య‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   20 May 2019 5:00 AM GMT
చిన‌బాబు ఓట‌మి త‌థ్య‌మ‌ట‌!
X
మీడియా వ‌ర్గాల‌కు సుప‌రిచితం ఆరా పోల్స్ స్ట్రాట‌జీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ. ఈ సంస్థ చెప్పే అంచ‌నాలు చాలా వ‌ర‌కూ నిజ‌మ‌య్యాయి. అన్నింటికి మించిన ఊహించ‌ని విధంగా విజ‌యాలు సొంతం చేసుకున్న ప్ర‌తిసారీ.. ఈ సంస్థ త‌న అంచ‌నాల్ని తూచా త‌ప్ప‌కుండా చెప్ప‌టం.. ఓటింగ్ స‌ర‌ళిని ప‌సిగ‌ట్ట‌టంలో మంచి పేరుంది.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ నేతృత్వంలో న‌డిచేదిగా చెప్పే ఈ సంస్థ‌.. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌న్న మాట‌ను అంద‌రి కంటే బ‌లంగా చెప్పారు. అప్ప‌ట్లో ఆ మాట‌ల్ని మిగిలిన వారు ప‌ట్టించుకోలేదు. కానీ.. అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన ఫ‌లితాల్ని ఆరా సంస్థ ముందే ప‌సిగ‌ట్టింది.

2008 నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వ‌హిస్తున్న సంస్థ అంచ‌నాలు ఎప్పుడూ త‌ప్పు కాలేదు. 2014లో విభ‌జ‌న కార‌ణంగా బాబు చేతికి అధికారాన్ని ఇచ్చార‌ని.. ప‌వ‌న్ తో క‌లిసి పోటీ చేయ‌టం లాభించిన‌ట్లుగా త‌మ ఎగ్జిట్ ఫ‌లితాల విడుద‌ల సంద‌ర్భంగా సంస్థ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఓటింగ్ తో పాటు.. కులాల ప్రాతిప‌దిక‌న కూడా స‌ర్వే చేసే సంస్థ‌.. ఏపీలో జ‌గ‌న్ విజ‌యం ఖాయ‌మ‌ని పేర్కొంది.

ఇదే తీరును 2018 చివ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిపీట్ చేయ‌టం ద్వారా.. ఓటింగ్ స‌ర‌ళిని.. ఓట‌ర్ మైండ్ సెట్ ను అంచ‌నా వేయ‌టంలో తాము ఎప్పుడు ఫెయిల్ కాద‌న్న భావ‌న‌ను క‌లిగించింది. అలాంటి సంస్థ‌.. తెలంగాణ‌.. ఆంధ్రప్ర‌దేశ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిద‌న్న విష‌యాన్ని త‌న ఎగ్జిట్ పోల్స్ తో స్ప‌ష్టం చేసింది.

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ గెలుపు ప‌క్కా అని తేల్చిన సంస్థ‌.. ఏపీలో జ‌గ‌న్ విజ‌యం సాధించ‌టం త‌థ్య‌మంది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ క్లియ‌ర్ క‌ట్ మెజార్టీతో విజ‌యాన్ని సాధిస్తార‌ని.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీకి ఇబ్బందిక‌రంగా ఉంటాయ‌న్న విష‌యాన్ని తేల్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే..అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా చూస్తున్న చంద్ర‌బాబు కుమారుడు మంత్రి లోకేశ్ గెలుపుపై ఆస‌క్తిక‌ర అంచ‌నాను వినిపించింది. మంగ‌ళ‌గిరి బ‌రిలో ఉన్న లోకేశ్ గెలుపు సందేహ‌మేన‌ని తేల్చింది. కుల స‌మీక‌ర‌ణాలు.. బాబు పాల‌న‌తో పాటు.. లోకేశ్ వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మా కూడా తుది ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేస్తుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. ఆరా ఎగ్జిట్ పోల్స్ ఆయ‌న ఓట‌మి త‌ప్ప‌ద‌న్న అంచ‌నాను వినిపించ‌టం గ‌మ‌నార్హం.