Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్... రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా

By:  Tupaki Desk   |   21 Oct 2019 4:53 PM GMT
ఎగ్జిట్ పోల్స్... రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా
X
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎట్టకేలకు పోలింగ్ ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీగా కొనసాగుతున్న బీజేపీ... వరుసగా రెండో పర్యాయం కూడా ఆ రెండు రాష్ట్రాల్లో మరోమారు అధికారం చేపట్టబోతోందట. ఈ మేరకు దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. మహారాష్ట్రలో రికార్డు విక్టరీ కొట్టబోతున్న బీజేపీ... హర్యానాలోనూ కాంగ్రెస్ ను చిత్తు చేయడం ఖాయమేనని ఈ సర్వేలు వెల్లడిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సారైనా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంటామని బీరాలు పలికిన హస్తం పార్టీ కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదని కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

సోమవారం ఉదయం ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం కాగా... ఎక్కడ కూడా చిన్న గొడవలు కూడా జరగకుండానే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అంతేకాకుండా రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్దేశించేందుకు ఓటర్లు కూడా ఈ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పోలింగ్ కు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో భారీగానే పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ పోల్స్ లో మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీకే అనుకూలంగా ఫలితాలను వెలువరించాయి. దాదాపుగా అన్ని సంస్థలు కూడా బీజేపీనే విజయం వరిస్తుందని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే తక్కువ సీట్లనే గెలుస్తుందని కూడా సర్వేలు వెల్లడించాయి.

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే... బీజేపీ మునుపటి మాదిరే శివసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లింది. ఇక్కడ మొత్తం 288 అసెంబ్లీ సీట్లండగా... బీజేపీ-శివసేన ఏకంగా 230 స్థానాలు కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి కేవలం 48 సీట్లకు పరిమితం కానుండగా, ఇతరులు ఓ పది సీట్లను గెలుచుకుంటారని ఆ సంస్థ వెల్లడించింది. ఇక ఇండియా టుడే సంస్థ అంచనా ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి 166 నుంచి 194 సీట్లను కైవసం చేసుకోనుండగా... కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 72 నుంచి 90 సీట్లలో విజయం సాధిస్తుందట. ఇతరులు 22 నుంచి 30 సీట్లలో విజయం సాధిస్తారని ఈ సంస్థ తెలిపింది.

సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ అయితే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ఏకంగా 243 సీట్లను గెలుచుకుంటుందని భారీ అంచనాలు కట్టింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి 41 సీట్లకు పరిమితం కానుందని చెప్పిన ఈ సంస్థ... ఇతరులు నాలుగు చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. ఏబీపీ న్యూస్ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమి 204 సీట్లను - కాంగ్రెస్ కూటమి 65 సీట్లను - ఇతరులు 15 సీట్లను గెలుచుకుంటారట. ఇక హర్యానాలోనూ మహారాష్ట్ర తరహా ఫలితాలే వస్తాయని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఈ సర్వేల నేపథ్యంలో ఇటు మహారాష్ట్రతో పాటు అటు హర్యానాలోనూ బీజేపీ శ్రేణులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టేశాయి.