Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాల ఓటర్లు మార్పుకే ఓటేశారు

By:  Tupaki Desk   |   17 May 2016 4:36 AM GMT
నాలుగు రాష్ట్రాల ఓటర్లు మార్పుకే ఓటేశారు
X
సుదీర్ఘంగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం సోమవారంతో ముగిసింది. ఓటరు మారాజు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అధినేతల తలరాతల్ని డిసైడ్ చేసి.. ఫవర్ ఎవరికి కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని తీసేసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. ఐదు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. వివిధ మీడియా సంస్థలు తమ తమ పోలింగ్ సర్వేల్ని వెల్లడించాయి. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాల్ని ఒక్క లైనులో చెప్పాలంటే.. ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల ఓటర్లు మార్పుకు ఓటేశారు. పశ్చిమ బెంగాల్ లో తప్పించి మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికారపక్షాలు మారనున్ననట్లు తేలిపోయింది.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారపగ్గాల్ని చేపట్టనున్నట్లు అన్ని సర్వేలు తేల్చేశాయి. బీజేపీకి ఆ రాష్ట్రంలో భంగపాటు తప్పదని.. కమ్యూనిస్ట్ లు మరోసారి ప్రతిపక్ష హోదా దక్కటం ఖాయంగా తేలింది. ఇక.. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న కమలనాథుల కోరిక ఈసారి తీరనుంది. తొలిసారి అసోంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు పక్కా అని తేల్చాయి. ఇక.. దక్షిణాదిన జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. కేరళలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలటం ఖాయమని తేలిపోయింది.

ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికారపక్షంగా ఉన్న కాంగ్రెస్ విపక్షంలోకి మారటం.. వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కే పట్టం పక్కా అన్న విషయం తేలిపోయింది. కాంగ్రెస్ సర్కారుపై ఉన్న ఆరోపణలతో మార్పు దిశగా కేరళ ఓటర్లు ఓట్లు వేసినట్లుగా ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. కేరళ మీద ఆశలు పెట్టుకున్న బీజేపీకి పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పాలి.

ఇక.. బుజ్జి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మీద తమిళనాడు ఎన్నికల ప్రభావం మరోసారి పడనుంది. వాస్తవానికి ఇక్కడి అధికారపక్షం మీద అసంతృప్తి పెద్దగా లేకున్నా.. తమిళనాడు ఎన్నికల ప్రభావం పుదుచ్చేరి మీద పడే సంప్రదాయానికి అనుగుణంగా డీఎంకే కూటమికే అధికారపగ్గాలు చేజిక్కనున్నాయి.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడటం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఒకసారి పవర్ ఇచ్చిన పార్టీకి మరోసారి అధికారం ఇచ్చేందుకు ఇష్టపడని తమిళ ఓటర్ల మైండ్ సెట్ కు అనుగుణంగానే తాజాగా మార్పుకే ఓటేశారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అమ్మకు ఈసారి ఎదురుదెబ్బ తగలటం ఖాయమని తేలిపోయింది. ఎన్నికల సమయంలో తానే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్న ఎండీఎంకే అధినేత విజయకాంత్ ఆశలు ఏ మాత్రం తీరేది లేదని తేలిపోయింది. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే – కాంగ్రెస్ కూటమికే పవర్ అన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.