Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు గోవాలో క్యాంప్ రాజకీయాలు షురూ

By:  Tupaki Desk   |   9 March 2022 4:24 AM GMT
ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు గోవాలో క్యాంప్ రాజకీయాలు షురూ
X
ఎన్నికల ఫలితాలు వెలువడి.. ఎవరికి సరైన బలం రాని వేళ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేయటం..ఈ క్రమంలో క్యాంప్ రాజకీయాల్నినిర్వహించటం తెలిసిందే. అయితే.. తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మూడు రోజులు ముందే.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావటం.. అందులో గోవాలో పోటీ తీవ్రంగా ఉందని.. గెలుపు ఎవరిదన్న విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కొత్త రాజకీయ కాకకు తెర తీసింది.

ఎవరికి మెజార్టీ కట్టబెట్టని ఎగ్జిట్ పోల్స్ హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించటంతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అలెర్టు అయ్యాయి. ఫలితాలకు ముందే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యే అభ్యర్థులతో క్యాంప్ రాజకీయాల్ని షురూ చేసింది. తమ అభ్యర్థులందరిని తీసుకొని గోవాలోని ఒక రిసార్టులో ఉంచే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

మరోవైపు గోవా తాజా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలంతా గోవా ఎన్నికల ఇన్ చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమై.. చర్చలు జరపాలని నిర్ణయించారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికల పోలింగ్ పూర్తి అయినప్పటికీ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ లో భాగంగా రేపు (మార్చి 10, గురువారం) కౌంటింగ్ షురూ కానుంది.

ఎన్నికల ఫలితాలు ఎవరికి అధికారాన్ని ఇచ్చేలా ఉండవని.. హంగ్ ఏర్పడటానికి అవకాశం ఉందని స్పష్టం చేస్తున్న వేళ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తే.. బీజేపీ మోడీ డైరెక్షన్ లో పని చేసేందుకు వీలుగా సమావేశమైందని చెప్పాలి.

కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఉత్తర గోవాలోని ఒక రిసార్టులో ఈ రోజు (బుధవారం) నుంచి ఉంచనున్నారు. రిసార్టు నుంచి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లటం.. ఫలితాలు వెల్లడైన తర్వాత గెలిచిన వారు పార్టీ ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.

తనకు ఏమైనా అవకాశం వస్తే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదన్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి. గోవా ఓటర్ల తీర్పు కంటే ముందే.. మొదలైన రాజకీయ కాక.. ఎక్కడి దాకా వెళుతుందో తేలాలంటే రేపు మధ్యాహ్నానానికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందని చెప్పాలి.