Begin typing your search above and press return to search.

తమిళనాడులో మళ్లీ అమ్మదే గెలుపు?

By:  Tupaki Desk   |   6 March 2016 7:56 AM GMT
తమిళనాడులో మళ్లీ అమ్మదే గెలుపు?
X
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలితే ముఖ్యమంత్రి పీఠం అందుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా సీ ఓటర్స్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు జయకు అనుకూలంగానే వచ్చాయి. ఈసారి కూడా తమిళులు అన్నాడీఎంకేనే గెలిపిస్తారని... అయితే, మెజారిటీ మాత్రం తగ్గుతుందని తేలింది.

మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో జయలలితకు చెందిన అన్నా డీఎంకే 116 సీట్లు సాధిస్తుందని సీ ఓటర్స్ సర్వేలో వెల్లడైంది. అన్నాడీఎంకే ప్రత్యర్థి పార్టీ డీఎంకేకు 101 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది. మిగతా 18 స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు.

సీ ఓటర్స్ సర్వే నిజమైతే అమ్మ బలం భారీగా తగ్గిపోయినట్లేనని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిపితే జయ బలగం 203 మంది ఎమ్మెల్యేలు. డీఎంకేకు కేవలం 31 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. పైగా ఇతరులెవరూ డీఎంకే కూటమిలో లేరు. అలాంటింది 150 నుంచి 116 స్థానాలకు పడిపోతారంటే జయ జాగ్రత్త పడకపోతే గెలుపు కష్టమయ్యే ప్రమాదమూ ఉందని చెప్పాలి.