Begin typing your search above and press return to search.

నంద్యాల ఫలితం స‌ర్వే...ఎంతో గంద‌రగోళం

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:31 AM GMT
నంద్యాల ఫలితం స‌ర్వే...ఎంతో గంద‌రగోళం
X
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత ఎపిసోడ్‌ లోనూ అదే ఆస‌క్తిని కొన‌సాగింప‌చేస్తోంది. 28న కౌంటింగ్ కావటంతో సర్వే ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బుధవారం నాడు ఉప ఎన్నిక సందర్భంగా పలు సంస్థలు సర్వేలు నిర్వహించగా...వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు విభిన్నమైన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ఆంధ్రా అక్టోపస్‌ గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. మరోవైపు ప్యూపల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రిపోల్ శాంపిల్ సర్వేలో వైకాపా గెలుస్తుందని వెల్లడించింది.

అయితే మ‌రుస‌టి రోజు ఢిల్లీలో లగడపాటి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందని తమ టీం అంచనాకు వచ్చినట్టు చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, ఈ ఎన్నిక ఫలితంపై తన టీంతో సర్వే చేయించానని, అనంతరం టీడీపీ గెలుసుందన్నది ఒక అంచనా మాత్రమేనని వెల్లడించారు. అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్లకు ముందు, అనంతరం ప్రచార సమయంలో - ఎన్నిక సందర్భంగా తమ టీం సర్వే చేసిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని సందర్భాల్లోను తెలుగుదేశం పార్టీకే ప్రజలు మొగ్గు చూపినట్టు తేలిందన్నారు. ఈ ఫలితాల్లో గెలుపోటముల కారణాలకు సంబంధించి తాను ఎలాంటి విశ్లేషణ చేయదల్చుకోలేదని ల‌గ‌డ‌పాటి అన్నారు.

మ‌రోవైపు నంద్యాలలో ఆగస్టు 17 -18 - 19లలో ప్యూపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రిపోల్ శాంపిల్ సర్వేలో అధికార పార్టీ టీడీపీ - ప్రతిపక్షపార్టీ వైకాపాల మధ్య హోరాహోరీగా గట్టిపోటీ జరిగినట్టు పేర్కొంది. ముఖ్యంగా టీడీపీకి 45.6శాతం - వైకాపాకు 48.3శాతం ఓట్లు వస్తాయని - 2.7 శాతం ఓట్లతో వైకాపా గెలుస్తోందని ఆ సంస్థ పేర్కొంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2.3శాతం ఓట్లు - ఇతరులకు 2.5శాతం - నోటాకు 1.3శాతం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉపఎన్నికకు ముందు మూడు రోజుల ముందు జరిపిన ఈ సర్వే ఫలితాల్లో మార్పు ఉండే అవకాశం ఉందని కూడా ఈ సంస్థ వెల్లడించింది. 2014లో అప్పటి వైకాపా అభ్యర్థి నాగిరెడ్డి - టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్య జరిగిన ఎన్నిక మాదిరిగానే ఈ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని వెల్లడించింది. కాగా ఆగస్టు 17 -18 - 19 తేదీలలో 48పోలింగ్ బూత్‌ లకు సంబంధించి 1,433మంది వివిధ కులాలకు - మతాలకు చెందిన వారి నుంచి శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ వెల్లడించింది. మొత్తంగా నంద్యాల ఓట‌రు నాడి స‌ర్వే సంస్థ‌ల‌కు కూడా దొర‌క‌డం లేదంటున్నారు.