Begin typing your search above and press return to search.

కరోనా టీకాపై చేసే వ్యయం వృథా: వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   19 March 2021 9:42 AM GMT
కరోనా టీకాపై చేసే వ్యయం వృథా: వైసీపీ ఎంపీ
X
కోవిడ్-19 లాంటి వైరస్ లు ప్రతీ వందేళ్లకోసారి మాత్రమే వస్తాయని.. వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ లోక్ సభలో చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక వైద్యుడిని అని.. తన దృష్టిలో కేంద్రం టీకాల కోసం వెచ్చిస్తున్న రూ.35వేల కోట్ల ఖర్చు వృథా అని అభిప్రాయపడ్డారు.

కేంద్రబడ్జెట్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పద్ధులపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్19 టీకాలను దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ.35వేల కోట్లు వెచ్చించాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే వైద్యుడిగా నా దృష్టిలో అదంతా వేస్ట్ అని వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 6-9 నెలలు పనిచేసే ఈ టీకా కోసం అన్ని కోట్లు పెట్టడం అవసరం లేదన్నారు.

ఈ మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య రక్షణకు మళ్లించాలని.. అది దేశానికి ఎంతో అవసరం అని వైసీపీ ఎంపీ సంజీవ్ వ్యాఖ్యానించారు. కోవిడ్ కు విశ్వజనీనమైన టీకా సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని.. కేంద్రం కళశాలలకు నిధులు ఇవ్వాలని కోరారు.

దేశంలో 70శాతం ప్రజలు గ్రామాల్లో ఉంటే.. 30శాతం మాత్రమే అర్హులైన వైద్యులు ఉన్నారని.. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు వెళ్లేందుకు వారికి పన్నులు, పరికరాల కొనుగోళ్లు,విద్యుత్ రాయితీలు ఇవ్వాలని వైసీపీ ఎంపీ అన్నారు.