Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి డిజైన్ల‌పై మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లైంది

By:  Tupaki Desk   |   29 July 2016 6:11 AM GMT
అమ‌రావ‌తి డిజైన్ల‌పై మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లైంది
X
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం తెర‌మీద‌కు వ‌స్తున్న డిజైన్లు వివాదాస్పదం అవుతున్నాయి. సింగ‌పూర్ డిజైన్ల‌పై అభ్యంత‌రాలు - అప‌హాస్యం వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో ఇటీవ‌లే నూత‌న న‌మూనాల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సింగపూర్‌ ప్లాన్‌ పై ప్రముఖ ఆర్కిటెక్ట్‌ లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌ ప్రణాళిక కాలం చెల్లిన డిజైన్‌ అని విమర్శిస్తున్నారు.

సహజ నగరాల నిర్మాణంపై ఢిల్లీలోని ఐసోలా(ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటక్ట్స్‌) సంస్థ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ప్రముఖ ఆర్కిటెక్ట్‌ లు రోమీకొస్లా - విక్రమ్‌ సోని - రోహిత్‌ మారూల్‌ - న్యాచురల్‌ హెరిటేజ్‌ ఫస్ట్‌ సమన్వయకర్త బొలిశెట్టి సత్యనారాయణ - జాతీయ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బంజీ - అమరావతి ప్రాంత రైతులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం అంతా సహజ నగరాల వైపు మొగ్గు చూపుతుంటే ఆకాశహర్మ్యాలు అంటూ పంటపొలాలను నాశనం చేసిన రాజధాని నిర్మాణం చేపట్టడం సబబుకాదని పేర్కొన్నారు.

ప్రస్తుత అమరావతి నిర్మాణ ప్రణాళిక పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర విపత్కర పరిణామాలు ఏర్పడుతాయని విక్రం సోని - రోమి - బోంజి ఆందోళన వ్యక్తం చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాల వల్ల తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ - బిల్డర్ల కోసమే అన్నట్టుగా రాజధాని నిర్మాణ ప్రణాళికను రూపొందించారని విమర్శించారు.

చంద్రబాబు సర్కారు తాము రూపొందించిన ప్రణాళికపై స్పందించడం లేదని - సింగపూర్‌ ప్రణాళికతో అమరావతి నిర్మిస్తే విజయవాడ ఉష్టోగ్రతలు 55 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉందని బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. వ్యవసాయ భూములను నాశనం చేసి రాజధాని నిర్మించడం వల్ల కాలుష్యం, వేడి పెరిగి పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. బహుపంటలు పండే భూములను నాశనం చేయవద్దని, సహజ నగరాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నారు. ప్రభుత్వం వీటిని పక్కన పెట్టి మొండిగా వ్యవహారిస్తుందని, భవిష్యత్తు తరాల మనుగడ సాధించలేవని వక్తలు విమర్శించారు.