Begin typing your search above and press return to search.

కాలం చెల్లిన రెమిడెసివిర్.. 60 లక్షల ఇంజక్షన్లు ధ్వంసం

By:  Tupaki Desk   |   7 Jun 2022 8:34 AM GMT
కాలం చెల్లిన రెమిడెసివిర్.. 60 లక్షల ఇంజక్షన్లు ధ్వంసం
X
కరోనా రెండో దశలో ప్రపంచాన్ని గడగడలాడించింది. వైరస్ సోకిన వారిలో చాలా మంది మరణించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా మృతి చెందడం ప్రపంచ దేశాలను కలవర పెట్టింది. అయితే ఈ దశలోనే కరోనా చికిత్సలో రెమిడెసివర్‌ మందు సమర్థంగా పనిచేస్తుందనే నమ్మకం కలిగింది. ఇంకేంటి తమ వాళ్లను కాపాడుకోవడానికి బాధితుల కుటుంబ సభ్యులు ఈ మందు కోసం గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాశారు. కానీ కాలం మారింది. కరోనా తగ్గింది. మరి ఇప్పుడి ఈ రెమిడెసివర్‌లతో వాడకమూ తగ్గిపోయింది.

గతేడాది కరోనా రెండో దశ ప్రపంచ యువతను గడగడలాడించింది. కరోనా మరణాల్లో రెండో దశలో ఎక్కువగా యువతనే మహమ్మారి బలి తీసుకుంది. ఈ దశలో కరోనా లో చికిత్సలో రెమిడెసివిర్ అనే ఔషధం చాలా ఉపయోగపడింది. ఇది కొవిడ్ చికిత్సలో సమర్థంగా పని చేస్తుందనే నమ్మకంతో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది.

రెండో దశలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం.. కేసులు భారీగా పెరగడం వల్ల రెమిడెసివిర్‌కు డిమాండ్ పెరిగింది. కానీ డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్ల మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడింది. ఈ మందు కోసం బాధితుల కుటుంబీకులు గంటల తరబడి మెడికల్ షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు కొందరు అక్రమార్కులు అమాయకుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ మందును అధిక ధరకు బ్లాక్‌లో అమ్మడం కూడా మొదలుపెట్టారు.

తమ వారిని కాపాడుకోవాలన్న తపనతో బ్లాక్‌లోనూ ఈ మందును కొనడం మొదలుపెట్టారు బాధితుల కుటుంబ సభ్యులు. కానీ కేసులు భారీగా పెరగడం వల్ల ఎంత డబ్బు చెల్లించినా ఒక్కోసారి బ్లాక్‌లో కూడా రెమిడెసివిర్ దొరకలేదు. కానీ ఇప్పుడు కరోనా తగ్గిపోయింది. రెమిడెసివిర్‌లతో పెద్దగా ఉపయోగం లేదని తేలిపోయి వాటి వాడకం తగ్గిపోయింది. వాడకం తగ్గడం తో రెమిడెసివిర్ ఇంజక్షన్లు భారీగా మిగిలిపోయాయి. చాలా వరకు ఎక్స్‌పైర్ అయిపోయాయి. కాలం చెల్లిన ఈ ఇంజెక్షన్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దాదాపు 60 లక్షల రెమిడెసివర్‌లు ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్నాయని బీడీఆర్ ఫార్మ కంపెనీ ఛైర్మన్ ధర్మేశ్‌ షా చెప్పారు. ముంబైకు చెందిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని అనేక సంస్థల దగ్గర రెమిడెసివర్‌లతోపాటు, ఇతర కరోనా ఔషధాలు కూడా ఉన్నాయి.

అందులో 60 లక్షల రెమిడెసివర్‌ల విలువ దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుంది. ఇతర ఔషధాల విలువ దాదాపు 200-400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మొత్తం త్వరలో ఎక్స్‌పైర్ అవ్వనున్న మందుల విలువ రూ.800-1000 కోట్ల వరకు ఉంటుంది. ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్న ఔషధాల్ని నాశనం చేయడం తప్ప కంపెనీలకు మరో ప్రత్యామ్నాయం లేదు.