Begin typing your search above and press return to search.

బిహార్‌ రైల్వేస్టేషన్‌ లో పేలుడు ... హైదరాబాద్ తో లింక్ !

By:  Tupaki Desk   |   29 Jun 2021 5:32 AM GMT
బిహార్‌ రైల్వేస్టేషన్‌ లో పేలుడు ... హైదరాబాద్ తో లింక్ !
X
గతంలో దేశంలో ఏ మూల ఏ బాంబ్ పేలినా , ఏ మూల ఏ ఘటన చోటు చేసుకున్నా కూడా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ లో ఉంటాయనే ఒక అపకీర్తి ఒకటి ఉండేది. కానీ, ఈ మద్యే ఆ పేరు తొలగిపోతున్న నేపథ్యంలో మరో ఘటన ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా బిహార్‌ లోని దర్భంగ రైల్వేస్టేషన్‌ లో చోటుచేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్‌ లో బయటపడ్డాయి. ఈ నెల 17న దర్భంగ రైల్వేస్టేషన్‌ లోని ప్లాట్‌ ఫాం నెంబర్ వన్ లో సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలులోంచి ఓ వస్త్రాల పార్శిల్‌ ను దింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏ ప్రమాదం జరగకపోయినా కూడా ఉగ్రవాద కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్శిల్‌ దర్భంగకు చెందిన మహమ్మద్‌ సూఫియాన్‌ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది.

ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ కు చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్‌ సలీం ఖాసీం, మహమ్మద్‌ కఫీల్‌ ను అరెస్టు చేసింది. వీరిద్దరికీ పాకిస్థాన్‌ నుంచి నిధులు బదిలీ అయినట్లు వెల్లడైంది. పాక్ కి చెందిన ఇక్బాల్‌ ఖానా అనే వ్యక్తి వీరికి డబ్బు పంపినట్లు ఎన్‌ ఐఏ గుర్తించింది. ఇక్బాల్‌ ద్వారా వీరిద్దరికీ హైదరాబాద్‌ లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ పరిచయమైనట్లు నిర్ధారించింది. అదే సమయంలో పేలుడుకు కారణమైన వస్త్రాల పార్శిల్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చినట్లు తెలిపారు. దీంతో బిహార్‌ ఏటీఎస్‌ అధికారులు ఓ బృందాన్ని సికింద్రాబాద్‌ కు పంపారు. వారు తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ అధికారులతో కలిసి పలు ఆధారాలను సేకరించారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కు వచ్చిన ఇద్దరు యువకులు వస్త్రాల పార్శిల్‌ ను రైల్వే కౌంటర్‌ వద్ద అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వారిద్దరినీ సోమవారం అరెస్టు చేశారు. వారిని ఇమ్రాన్‌, నాసిర్‌ అని, వారిద్దరూ అన్నదమ్ములని గుర్తించారు.

ప్రస్తుతం వారిద్దరూ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ లో బిహార్‌ ఏటీఎస్‌ నిర్బంధంలో ఉన్నారు. త్వరలోనే ఎన్‌ ఐఏ బృందాలు వారిని అదుపులోకి తీసుకోవచ్చు. అయితే ఈ నెట్‌ వర్క్‌ వెనక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ముంబై జైలులో ఉన్న ఐఎం ఆపరేటివ్‌ యాసీన్‌ భత్కల్‌ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రపన్నినట్లు నిఘావర్గాల హెచ్చరికలు ఉన్నాయి. దర్భంగ రైల్వేస్టేషన్‌లో జరిగిన పేలుడుకు కారణమైన ద్రవ పదార్థం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. బిహార్‌ ఏటీఎస్‌ అధికారులు పేలుడు ఘటనాస్థలి నుంచి నమూనాలను అక్కడి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ కు తరలించారు.